- హై ఫై టెక్నాలజీతో సైబర్ క్రిమినల్స్ ఆన్‌లైన్ ఫ్రాడ్
- నమోదయ్యే కేసుల్లో10 శాతం మాత్రమే ట్రేసింగ్
- స్కిల్ ఉన్న ఐటీ యువత సెలెక్షన్ చేసుకుంటూ..
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ట్రైనింగ్
హైదరాబాద్,వెలుగు: సైబర్ కేసుల్లో పోలీస్ డిపార్ట్ మెంట్ ను స్కిల్స్ కొరత వేధిస్తోంది. హై టెక్నాలజీతో సైబర్ క్రిమినల్స్ రూ.వేల కోట్లు కొట్టేస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ లేకపోవడంతో కేసులు అటకెక్కుతున్నాయి. ప్రతి ఏటా నమోదయ్యే సైబర్ కేసుల్లో కేవలం10 శాతం మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. దీంతో కేసుల దర్యాప్తులో ఐటీ ఎంప్లాయీస్, ప్రయివేట్‌ఎథికల్ హ్యాకర్స్, నెట్‌వర్కింగ్ ఎక్స్‌పర్ట్స్‌ను వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్, లోన్ యాప్స్ వంటి తీవ్రమైన నేరాలను గుర్తించడంలోనూ ప్రయివేట్ ఏజెన్సీలనే పోలీసులు ఆశ్రయిస్తున్నారు.
కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంటూ..
సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో జాబ్ చేసే యువతను సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులు భాగస్వాములను చేస్తున్నారు. ఇందుకు ఆయా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. డిపార్ట్ మెంట్ లో టెక్నికల్ మ్యాన్ పవర్‌ను తయారు చేసేలా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై వారిలో అవగాహన కలిగిస్తున్నారు. హై టెక్నాలజీతో పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్ ను నియంత్రించేందుకు అవసరమైన టెక్నికల్ స్కిల్, అధునాతన సాఫ్ట్‌వేర్‌ను వాడుకునేలా కావాల్సిన యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐటీ ఇండస్ట్రీలో నైపుణ్యత కలిగిన యువతను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
అకాడమీలో ట్రైనీ ఎస్ఐలకు ..
పోలీస్ అకాడమీలో శిక్షణ పొందే ఎస్‌ఐల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌పై పూర్తి ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం అకాడమీలో 200 మందికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో 72 మంది నైపుణ్యం కలిగిన ఎస్‌ఐలకు సైబర్ నేరాల నియంత్రణ, ట్రేసింగ్ సహా హై ఫై టెక్నాలజీలో శిక్షణ అందిస్తున్నారు. వీరితో పాటు ప్రయివేట్ ఎథికల్ హ్యాకర్స్‌ను కూడా తమ ఇన్వెస్టిగేషన్ లో వినియోగిస్తున్నారు. ప్రభుత్వ, ఐటీ కంపెనీలు, బ్యాంక్స్, ఇతర కార్పొరేట్ కంపెనీలపై జరిగే సైబర్ అటాక్స్‌ను గుర్తించేలా ల్యాబ్ ఏర్పాటు చేశారు. సైబర్ అటాక్స్ జరిగినా ట్రాక్ చేసేందుకు ప్రత్యేక టూల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించారు. వీటి ద్వారా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో పోలీసులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
“ రెండేళ్ల కిందట మహేశ్ కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ చేసి ఫిష్షింగ్ మెయిల్‌తో సైబర్ క్రిమినల్స్ రూ.12.4 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో 100 మంది పోలీసులు 14 రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు. సాఫ్ట్వేర్ స్కిల్స్ లేకపోవడంతో ప్రయివేట్ ఎథికల్ హ్యాకర్స్‌ను వినియోగించారు. వర్చువల్ ఐపీలతో విదేశాల నుంచి హ్యాకింగ్ చేసినట్లు గుర్తించారు. కేసు ఇన్వెస్టిగేషన్ కు రూ.58 లక్షలు ఖర్చు చేశారు.’’
‘‘ ఏడాదిన్నర కిందట చైనా ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్ కేసుల్లో సిటీ పోలీసులు ప్రయివేట్ ఏజెన్సీల సహకారం తీసుకున్నారు. యాప్ లింక్స్‌ను గుర్తించేందుకు ఆన్‌లైన్ యాప్ డెవలపర్స్, ఐటీ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేశారు. చైనాకు చెందిన ‘లీ లౌ, గుయాంగ్‌జౌ. నన్ ఏ, కెవిన్ జూన్’ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కోసం స్పెషల్ యాప్స్ క్రియేట్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులోనూ పోలీసులు పూర్తిగా ప్రయివేట్ ఏజెన్సీలపైనే ఆధారపడాల్సి వచ్చింది."