- తమకు సమాచారం ఇచ్చాకే పర్యటనలు పెట్టుకోవాలని సూచన
- వరుస ఎన్‌కౌంటర్లతో చెల్లాచెదురైన మావోయిస్టులు
- సరిహద్దు జిల్లాల్లో గట్టి నిఘా
హైదరాబాద్, వెలుగు: చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు రాష్ట్రంలోకి చొరబడకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా బోర్డర్స్‌లో నిఘా కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతానికి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించి ఎలాంటి కదలికలు లేనప్పటికీ.. తాము అప్రమత్తంగా ఉన్నామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సాధారణ తనిఖీలతోపాటు గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్’ లో భాగంగా చేపడుతున్న వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ ఎన్‌కౌంటర్లలో అగ్రనేతలు సైతం మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రంలోని సానుభూతిపరుల కదలికలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా సరిహద్దు జిల్లాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల ఎస్పీలు, సీపీలను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఎస్పీలు, సీపీలు నిరంతరం అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రధానంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గ్రేహౌండ్స్‌తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో కూంబింగ్ ముమ్మరం చేశారు. మావోయిస్టు కీలక నాయకులపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక నిఘా పెట్టింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే సరిహద్దు జిల్లాల్లో పర్యటనలు పెట్టుకోవాలని ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు.