
- ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీస్ వ్యవస్థను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో వారు చూపిన కర్తవ్య దీక్ష, నిబద్ధతతో రాష్ట్ర కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారని కొనియాడారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ, రాష్ట్ర ప్రజల తరపున పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడం ప్రతి తెలంగాణ పౌరుడికి గర్వకారణమన్నారు.
శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు చూపిన అంకితభావం, నిబద్ధతను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. పోలీసుల సంక్షేమాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించి, పోలీస్ సంక్షేమానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు.