హైదరాబాద్, వెలుగు: ఆకతాయిల ఆటకట్టించడానికి ఏర్పాటైన షీ టీమ్స్ పదేండ్లు పూర్తి చేసుకున్నాయి. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో పని చేస్తున్న షీ టీమ్స్ 2014 అక్టోబర్ 24న ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గురువారం విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పదేండ్ల కాలంలో 66,617 ఫిర్యాదులు అందాయని తెలిపారు. రెడ్ హ్యాండెడ్ గా 13,895 మందిని పట్టుకున్నామని చెప్పారు. 6,319 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. పబ్లిక్, సైబర్ స్పేస్ లో యువతులపై వేధింపులను అరికడుతున్నామని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాలు, వర్కింగ్ ప్లేసెస్ లో మహిళలపై వేధింపులు, బెదిరింపులు లేకుండా నిఘా పెట్టామని వివరించారు. వేధింపులకు గురయ్యే మహిళలు, యువతులు షీటీమ్స్ ను సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది వాట్సాప్ ద్వారా 549 ఫిర్యాదులు అందినట్టు వెల్లడించారు. బస్ స్టేషన్స్, మెట్రో, రైల్వే స్టేషన్స్, హాస్పిటల్స్, షాపింగ్ కాంప్లెక్స్ సహా ఇతర పబ్లిక్ ప్లేసెస్ లో 40 వేల క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ఏర్పాటు చేశామని వివరించారు. వీటి ద్వారా 84 ఫిర్యాదులు అందాయన్నారు.
మొత్తం పిటిషన్స్ 66,617
ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ 6,319
రెడ్ హ్యాండెడ్‌గా దొరికినవారు 13,895
పెట్టిన కేసులు 17,460
కౌన్సిలింగ్ 15,343
హెచ్చరించినవి 16,169