- 15 రోజులు మకాం.. 27 మంది అరెస్ట్
- ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో
- 29 బ్యాంక్ అకౌంట్లపై దేశవ్యాప్తంగా 2,223 కేసులు నమోదు
- రాష్ట్రంలో 189 కేసుల్లో లింక్స్..రూ.9 కోట్ల డిపాజిట్లు
- వివరాలు వెల్లడించిన సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న బ్యాంక్ అకౌంట్లపై టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ ఫోకస్ పెట్టింది. బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్ల ఆధారంగా దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించింది. రాష్ట్రంలో నమోదైన సైబర్ నేరాల్లో గుర్తించిన ఆన్‌లైన్ లింక్స్, బ్యాంక్ అకౌంట్లతో నిందితులను అరెస్ట్ చేస్తున్నది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లో 15 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు అందించిన 27 మందిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చింది. వీరి వద్ద నుంచి 31 సెల్ఫోన్లు, 37 సిమ్ కార్డులు,7 ఏటీఎం కార్డులు,2 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నది. మరో 33 మందిని గుర్తించి.. గాలిస్తున్నది. స్పెషల్ ఆపరేషన్ వివరాలను టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ మంగళవారం వెల్లడించారు.
చైనా, కంబోడియా నుంచి ఆపరేట్
చైనా, కంబోడియా, థాయ్‌లాండ్‌లో ఉన్న సైబర్ నేరగాళ్లు.. ఇండియాలో ఉన్న ఏజెంట్ల ద్వారా బ్యాంక్ అకౌంట్లు సేకరిస్తున్నారు. కమీషన్లకు ఆశపడిన వారు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 27 మంది.. ఫేక్ డాక్యుమెంట్లతో 29 కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేశారు. వీటిని రూ.50 వేల నుంచి రూ.5 లక్షల చొప్పున సైబర్ నేరగాళ్లకు అమ్ముకున్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బుల్లో కమీషన్లు తీసుకుని మిగిలిన మొత్తాన్ని క్రిప్టో, యూఎస్డీల్లో కన్వర్ట్ చేశారు
స్పెషల్ ఆపరేషన్లు
రాష్ట్రంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు టీజీ సీఎస్‌బీ అధికారులు స్పెషల్ ఆపరేషన్లు చేపడ్తున్నారు. బిజినెస్, ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ సహా ఇతర సైబర్ నేరాల డేటాను సేకరించారు. సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నంబర్లను ట్రాక్ చేశారు. అకౌంట్లను రాజస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తునట్లు గుర్తించారు. ఎస్పీ దేవేందర్ సింగ్ నేతృత్వంలో ఏసీపీ సూర్యప్రకాష్ సహా మొత్తం 40 మందికిపైగా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. జైపూర్, జోధ్‌పూర్, నగ్వర్‌లో 15 రోజుల పాటు తనిఖీలు చేశారు.
ఫేక్ అడ్రస్‌లతో కరెంట్ అకౌంట్లు ఓపెన్
ఫేక్ అడ్రస్‌లతో కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసిన వారిని గుర్తించారు. ఒక్కో ఖాతాలో దాదాపు 150 నుంచి 200 వరకు సైబర్ క్రైమ్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఈ అకౌంట్లలో రాష్ట్రంలో నమోదైన 189 కేసులకు సంబంధించి రూ.9 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదైన 2,223 సైబర్ క్రైమ్ కేసుల్లో 29 బ్యాంక్ అకౌంట్ల లింకులు బయటపడ్డాయి. వీటిలో మరో రూ.11.01 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ నేరస్తులకు ఇచ్చిన 27 మందిని అరెస్ట్ చేశారు. వీరిని రాజస్థాన్‌లోని లోకల్ కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. వీరిని తమ కస్టడీకి తీసుకుని పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదిస్తామని బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు.