తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వాతావరణం నాలుగురోడ్ల కూడలిలో నిలబడ్డట్టుంది. ప్రజాక్షేత్రం మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉంది. రెండు వరుస ఎన్నికల్లో చతికిలపడిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ‘పార్టీ పునరుద్దరణ ఎలా?’ అన్న మీమాంసలో తలమునకలై ఉంది. ఆరుమాసాల కింద అధికారం చేపట్టిన కాంగ్రెస్ హనీమూన్ ముగించుకొని, ముమ్మర కార్యాచరణకు సన్నద్ధమౌతున్నట్టుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ, ఇద్దరు తెలంగాణ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించి.. ఇక్కడ పార్టీని పటిష్టపరిచేందుకు సమాయత్తమౌతోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు బాకీపడ్డ ఈ తరుణంలో ప్రజాక్షేత్రం ఎలా ఉంది? అన్నది సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నికల్లో తమదైన విలక్షణ తీర్పు చెప్పిన తెలంగాణ సమాజం ఇప్పటికైతే గుంభనంగానే ఉంది. హడావుడి తగ్గి, తీరికగా తమ స్థితిగతుల్ని రాజకీయ పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి.
ఏ పార్టీలో చూసినా.. ఎక్కడ పెరిగాం? ఎక్కడ తగ్గాం? ఏమిటి కారణం? ఇవేలెక్కలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తమ పరిస్థితుల్ని మెరుగుపరుచుకునే దిశలో రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఇప్పుడు దృష్టి సారిస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీది బలుపా? వాపా? అన్నది ఇంకా ప్రశ్నార్థకమే! సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోకుంటే, ఇప్పటికి వచ్చిందేదైనా స్థిరంగా నిలిచేది కాదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో ఆశించి భంగపడ్డారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తామే అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకున్నా..చివరకు 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆరు మాసాల కింద అసెంబ్లీ, నెల కింద లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తెలంగాణలో.. పౌరుల స్మృతిపథం (రీకాల్ స్టాటస్)లో పాలకపక్షం కాంగ్రెస్, విపక్షం బీఆర్‌ఎస్ తప్ప బీజేపీ లేదని ‘పీపుల్స్ పల్స్’ సర్వేయర్లు తాజాగా జనసమూహాల్లో తిరుగుతుంటే తెలుస్తోంది.
పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో (2018) బీజేపీ ఒక స్థానానికే పరిమితమైనా, తదనంతర లోక్‌సభ ఎన్నికల్లో (2019) ఏకంగా 4 స్థానాలు గెలిచి అందరినీ విస్మయపరిచింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 2 చోట్ల (దుబ్బాక, హుజూరాబాద్) గెలిచింది. హైదరాబాద్ మహానగరపాలక ఎన్నికల్లో పాలకపక్షానికి దీటైన పోటీ ఇచ్చి, ఎన్నదగిన స్థానాలు దక్కించుకుంది. అదే క్రమంలో అసెంబ్లీ ఫలితాలుంటాయనుకున్నారు. కానీ, బీజేపీ భంగపడింది.
కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆరు మాసాల వ్యవధితో వచ్చిన లోక్‌సభ (2024) ఎన్నికల్లో మాత్రం పాలక కాంగ్రెస్‌కు దీటుగా 8 స్థానాల్లో గెలిచి బీజేపీ మళ్లీ సత్తా చాటింది. కానీ, ‘అది సబ్బునురగే... గట్టి పోటీదారులు వస్తే, బీజేపీ మళ్లీ తుస్సుమంటుందనే అభిప్రాయం కూడా ప్రజాక్షేత్రంలో ఉంది. సోషల్ ఇంజినీరింగ్ సరిగా జరగలేదు. పార్టీ అగ్రనేత , ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా మందకృష్ణకు తగు ప్రాధాన్యత కల్పించి, మాదిగలకు నిర్దిష్టంగా హామీ ఇచ్చి, టిక్కెట్లిచ్చినా.. అది ఎన్నికల్లో లాభించలేదు.
మాదిగలకు ఒకసీటు ఇవ్వకపోయినా, కాంగ్రెస్ 3 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లోనూ నెగ్గింది. కార్యకర్తలు, వివిధ స్థాయి కమిటీలతో బలమైన పార్టీ నిర్మాణం, ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం ఉంటే తప్ప ఏ సానుకూలత బీజేపీ పక్షాన నిలవదు. ఇది సాధారణ జనమే కాదు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా చెబుతున్నారు. మోదీ-3.0 ప్రభుత్వంలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్‌కి స్థానం కల్పించిన నాయకత్వం ఇక్కడ పార్టీ నిర్మాణంపై దృష్టి పెడుతుందని శ్రేణులు ఆశిస్తున్నాయి.
హనీమూన్ ముగిసినట్టే..
‘ఇప్పుడేగా గద్దెనెక్కాం..’ ‘ఇదుగో పార్లమెంట్ ఎన్నికలు..’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు మాసాల కాలాన్ని జాగ్రత్తగా నెట్టుకువచ్చింది. ఎక్కడా పెద్ద వ్యతిరేకత రాకుండా చూసుకున్నారు. అందుకే, తమ అయిదారు మాసాల పాలనకు లోక్‌సభ ఎన్నికలు ‘రెఫరెండం’ అనీ ప్రకటించుకున్నారు. కానీ, ఇకముందు అది సాగేలా లేదు. ఇంకా అందని కొన్ని గ్యారంటీ(హామీ)లు, జాప్యమౌతున్న పెన్షన్లు, రుతువు మారిన రైతుబంధు.. వంటివి జనాన్ని కొంత అసహనానికి గురిచేస్తున్నాయి.
స్థూలంగా ప్రభుత్వ పనితీరుపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు చేయడమన్నది, జనాన్ని ప్రభావితం చేసేటోళ్ల వరకే పరిమితమైనా.. వివిధ సంక్షేమ పథకాల లబ్ధి విషయంలో సామాన్యుల్లోనూ కొన్ని సందేహాలున్నాయి. వాటిని పటాపంచలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. హామీల జాబితా చాలా పెద్దది. ‘ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా గత (బీఆర్‌ఎస్) ప్రభుత్వమే నయం’ అనే భావన ప్రజల్లో ఇప్పుడిప్పుడే పొడచూపుతోంది.
అది మరింత బలపడే ఆస్కారం కనిపిస్తోంది. సదరు వ్యతిరేక భావనను బలపడనీయకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తెస్తున్నారు. ముఖ్య ఎన్నికలు ముగిశాయి. కనుక, ఇక ఫలాలు అందించడం, పాలనను గాడిన పెట్టడంపై శ్రద్ధ పెట్టాలనే సూచన వస్తోంది.
బీఆర్‌ఎస్‌కు ఎందుకీ గతి!
‘మనకు ఎందుకీ గతి పట్టింది?’ అన్న యోచన, బాధ బీఆర్‌ఎస్ పార్టీ వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తల్ని వేధిస్తోంది. సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలు చేసినా ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఎందుకొచ్చింది? సాధ్యంకాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ తప్పుదారి పట్టించిందనే రాజకీయ విమర్శ ఎలా ఉన్నా, ఇంక ఏఅంశాలు ఈ దుర్గతికి కారణం? అనే ప్రశ్నయితే వారి మెదళ్లను తొలుస్తోంది.
పార్టీ పేరులోంచి తెలంగాణ తొలగిపోయేలా ‘బీఆర్‌ఎస్’ అని మార్చడం, ఇక్కడి సమస్యల్ని గాలికి వదిలి ‘జాతీయ రాజకీయాలం’టూ ఎక్కడెక్కడికో తిరగటం, ఉద్యమవీరుల్ని పక్కన పెట్టి ‘బంగారుతెలంగాణ’ బ్యాచ్‌ని నెత్తికెత్తుకోవడం, తెలంగాణ అస్తిత్వానికి క్రమంగా దూరం కావడం, ప్రవర్తన`వ్యవహారశైలి వల్ల, ‘ఇది ప్రజానుకూల`ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు’ అన్న భావన జనంలో బలపడటం.. ఇలాంటివన్నీ కారణాలని పార్టీ విశ్లేషించుకుంటోంది.
కొన్ని కఠినమైన నిర్ణయాలకు సిద్దపడి, వైఖరి మార్చుకుంటే.. తెలంగాణలో పార్టీ పునరుద్దరణకు ఆస్కారం ఉందనే ఆశాభావం పార్టీలో వ్యక్తమౌతోంది. ఏం చేసైనా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిస్తేనే బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో స్థానమైనా, భవిష్యత్తయినా ఉంటుందనే అభిప్రాయం జనసమూహాల్లో ఉంది. ఎవరిదెంత బలం అన్నది ఇంకో ఎన్నికంటూ వస్తే తెలంగాణ సమాజం తేలిగ్గానే తేల్చేస్తుంది.
తప్పెక్కడ జరిగింది?
ఎన్నికల్లో దెబ్బ గట్టిగానే తగిలింది. గాయం పెద్దదే.. కోలుకోవడం ఎలా? అన్నదే ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ ముందున్న పెద్ద ప్రశ్న. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఒక అవకాశంగా లభించిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని మెరుగుపరచాలని నాయకత్వం యోచించింది. కానీ, ప్రతికూల వాతావరణంలో ఆ అవకాశమే వారికి చిక్కలేదు. నాయకులు చెల్లాచెదురయ్యారు.
కార్యకర్తల శ్రేణులు చేజారాయి. అధినాయకత్వం బతిమాలినా పోటీకి ఎవరూ సిద్ధపడని పరిస్థితి. సగటు పౌరులు కూడా.. ‘ఇవి మీ ఎన్నికలు కావులే, జాతీయ పార్టీలైన కాంగ్రెస్-, బీజేపీ మధ్య పోరును మేం తేలుస్తాం’ అన్నట్టు ఆ ఎన్నికల్లో స్పందించారు. తెలంగాణ ఓటు బ్యాంకులు రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య నిలువునా చీలిపోయాయి. ఫలితంగా బీఆర్‌ఎస్ పార్టీకి దక్కింది సున్నా!
త్రిముఖ పోటీ కాంగ్రెస్‌కే లాభమైంది
పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారబరిలో దూకడం వల్ల కొంత అనుకూల ఓటుబ్యాంకును నిలబెట్టగలిగారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో! కానీ, అది బీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని సీటు గెలిపించే స్థాయికి రాలేదు. పైగా, కాంగ్రెస్‌కే లాభమైంది. బీఆర్‌ఎస్ ఎంతో కొంతమేర నిలబడ్డ చోట అది ముక్కోణపు పోటీకి దారితీసి, కాంగ్రెస్‌కు అనుకూలమైంది.
బీఆర్‌ఎస్ ఏమాత్రం నిలబడలేని చోట, ఆయా శ్రేణులు, ఓటర్లు బీజేపీ పక్షం వహించడంతో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ఆధిపత్యం సాధించగలిగింది. ఫలితంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పార్లమెంట్ స్థానాలు వారికి దక్కాయి. ఇంత జరిగాక ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో ఎందరు నిలుస్తారు? ఎందరు జారుకుంటారు? అన్నది బీఆర్‌ఎస్ నాయకత్వానికి తలనొప్పిగా ఉంది.
దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ