
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర చాలా గొప్పది. ఏడు దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో గొప్ప ప్రతిపక్షనేతలెందరో ఉన్నారు. వారంతా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఒక రామ్మనోహర్ లోహియా, వాజ్‌పేయి, పుచ్చలపల్లి సుందరయ్య. జైపాల్‌రెడ్డి వంటి చాలామంది ప్రతిపక్ష నేతలు రాణించారు. వారి రాణింపు సమాజానికి ఎంతో ఉపయోగపడింది. ప్రత్యామ్నాయ రాజకీయాలను దేశానికి అందించగలిగారు కూడా. నిజం చెప్పాలంటే, ప్రతిపక్షమంటే ప్రజలే. అధికార పక్షంపై నిఘాపెట్టి దాన్ని దారిలోపెట్టే పాత్ర అది. ఇంకా చెప్పాలంటే, ప్రజల ప్రయోజనాలకు కాపలాదారులాంటి పాత్ర అది. ప్రతిపక్ష పాత్ర లభించడమే ఒక అదృష్టం. కానీ, ప్రస్తుత కాలంలో దాన్నో దురదృష్టంగా భావించేవారు తయారయ్యారు. దాంతో బుల్డోజ్ విమర్శలను ఆశ్రయిస్తున్నారు. విమర్శలు చేసేముందు దానికి తగిన నైతికత తమకు ఉందా లేదా అని సరిచూసుకునే పరిస్థితి కూడా ఉండటం లేదు.
‘ఇదేమన్న మహారాజుల కాలమా, యూనివర్సిటీలకు వందల ఎకరాలు ఎందుకు?’ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేసీఆర్ చేసిన కామెంట్ అది. ఇది సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. అలాంటి మాజీ సీఎం కుమారుడు కేటీఆర్ ఆందోళన చేస్తున్న హెచ్‌సీయూ భూములపై మాట్లాడుతుండటం చూసేవారికి హాస్యాస్పదంగా మారింది. ఒక రాజకీయ పార్టీగా హెచ్‌సీయూ భూములపై మాట్లాడటం అభ్యంతరం కాకపోవచ్చు. కానీ గతంలో ఆయన తండ్రి చేసిన కామెంట్‌ను ఎలా మర్చిపోయారనేదే ఆందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం . యూనిర్సిటీలకు వందల ఎకరాలు ఎందుకు అన్న ఆనాటి ముఖ్యమంత్రి ఇవాళ ఏ నైతికతతో మాట్లాడుతున్నారో అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత! నాలుక మడతేసి మాట్లాడినా ఆయనను నైతికత వెంటాడకతప్పదు! పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ యజమానులు భూముల అమ్మకాలలో ఏనాడైనా వావివరుసలు పాటించిన దాఖలా ఉందా? మీరు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు.. ఇవాళ హెచ్‌సీయూ భూముల అమ్మకాలు కూడా గత ప్రభుత్వం నేర్పిన విద్యయే అని ఎందుకు అనుకోకూడదు? హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టే ప్రయత్నానికి ఇటు విద్యార్థుల నుంచి, అటు పర్యావరణవేత్తల నుంచి, నగర ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. కానీ నైతికత లేని బీఆర్ఎస్ మద్దతు ఇస్తేనే ఆ భూములు అడ్డుకోబడతాయని మాత్రం తెలంగాణలో ఎవరూ భావించలేరు!
మిగులు రాష్ట్రంలో భూములు అమ్మి అప్పుల రాష్ట్రంగా మార్చినవారే.. ఇపుడు భూములు అమ్ముతున్నారెందుకు అని ప్రశ్నించడం ఎంత అనైతికంగా కనిపిస్తోందో వేరే చెప్పనక్కర లేదు! బీఆర్ఎస్ పాలనలో నగరం చుట్టూ ఉన్న సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మి 30వేల కోట్లను పప్పుబెల్లాలు చేశారు. అలాంటి పార్టీ ఇవాళ హెచ్‌సీయూ భూములపై మాట్లాడుతుంటే చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి కదా!
పాలేరులా పనిచేసి ఉంటే బాగుండేది కదా!
‘సీఎం రాజు కాదు.. పాలేరు’ అని ఇటీవల అన్నది ఎవరోకాదు, ప్రగతిభవన్ (రాజభవనం) నుంచి తెలంగాణను పదేండ్లు పాలించిన కేసీఆర్ కుమారుడు కేటీఆరే! ప్రజాస్వామ్యంలో ప్రజా సంబంధాలు లేని పాలకుడుగా కొనసాగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని లోకానికి తెలియందికాదు. అలాంటి కేసీఆర్‌ను మించిన ‘రాజు’ ఎవరుంటారు? పాలేరు గా పాలించి ఉంటే, ప్రగతిభవన్ గేటు ముందు గంటల తరబడి ఎదురు చూసిన గద్దర్‌కు దర్శనమివ్వకుండా ఆయనను ఎందుకు అవమానించినట్లు? పదేండ్లు తామే నడిపిన రాజరికాన్ని మర్చిపోయి ఇవాళ ‘సీఎం రాజు కాదు, పాలేరు’ అని చెప్పడంలో ఉన్న నైతికత ఎంత?
నవ్విపోదురు గాక..
పదేండ్లలో తాము చేసిన తప్పులనే ఇపుడు ప్రతిపక్షంగా మారి, ప్రశ్నించడం ఒక విచిత్రం. లోకల్‌బాడీ ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23శాతానికి తగ్గించింది తమ ప్రభుత్వమే అనే విషయాన్ని కూడా ఆమె మర్చిపోయి బీసీ రిజర్వేషన్లపై కవిత మాట్లాడటం చూసి నైతికతనే నవ్వుకునే పరిస్థితి! అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహం పెట్టాలని కవిత తాజా డిమాండ్.అందుకోసం దీక్షను కూడా ఆమె తలపెట్టడం కొసమెరుపు. పదేండ్లు అధికారంలో ఉన్నపుడు జ్యోతిబా పూలే ఆమెకు గుర్తుకు రాలేదు. మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఇవాళ పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంటే, నవ్వుకోని వారెవరైనా ఉంటారా? ‘నవ్విపోదురుగాక..’ అనే నానుడి ఒంటపట్టించుకున్న పార్టీ ఇవాళ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం! సంక్షేమ రాజ్యం పట్టని మైలేజీ ప్రశ్నలుప్రజలు కోరుకుంటున్న విషయాలను బీఆర్ఎస్ అడ్రస్ చేయగలుగుతున్న దాఖలా ఉన్నదా? తులం బంగారం ఏమైంది? వృద్ధుల పింఛన్ ఏమైంది లాంటి నగదు పథకాల మైలేజీ ప్రశ్నలు తప్ప, పేదలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేయాలని అడుగుతున్నారా? అలాంటి సంక్షేమ రాజ్యం వారికి పట్టదు. సంక్షేమ రాజ్యమే పట్టిఉంటే, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు విద్య, వైద్యం అంతగా దూరమయ్యేది కాదు మరి! పదేండ్లలో తాయిలాల రాజ్యాన్ని నిర్మించిన వారు, ఇపుడు సంక్షేమ రాజ్యం గురించి ఎలా అడుగుతారు?
ప్రతిపక్షం ప్రజల తరఫున ఉందా?
ధరణి స్థానంలో ప్రభుత్వం భూభారతి చట్టం చేసింది. దాని విధివిధానాలు గానీ, వెబ్‌సైట్‌గానీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి ద్వారా అనేక మంది రైతులు ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికీ పడుతున్నారు. ఆ విషయంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తున్నదా? ధరణి గురించి బీఆర్ఎస్ మాట్లాడుతున్న దాఖలా కనిపిస్తున్నదా? అందుకు కారణం, తమ పాలనా కాలంలోని పాపాలు కూడా అందులో దాగిఉన్నాయనేనా? భూమియే తెలంగాణ సంపద. పదేండ్లు బీఆర్ఎస్ యజమానులు దాన్ని అంత నిర్లక్ష్యంగా నిర్వహించి రైతులను ఇబ్బందుల పాలుచేసినవారు, ఇవాళ అదే రైతుల ఆవేదనను ఏమని ఎలుగెత్తుతారు? ఇలాంటి నైతికతలు అనేకం బీఆర్ఎస్ను వెంటాడుతున్నాయి. అది పరోక్షంగా తెలంగాణకు ఒక అనర్థంగా మారింది.
తమకోసం మాత్రమే!
తమకు కావలసింది అధికారం తప్ప, ప్రతిపక్షపాత్ర కాదు అనే అహంభావంలో బీఆర్ఎస్ యజమానులు జీవిస్తున్నారు. అనేక విషయాల్లో నైతికతలు కోల్పోయిన ప్రతిపక్షం ఉండడం వల్ల అధికార పక్షం కూడా దారితప్పే అవకాశం ఉంటది! కాస్తైనా నైతికతలు కలిగిన ప్రతిపక్షం ఉంటే, ప్రభుత్వం కూడా సరైన మార్గంలో నడుస్తూ ప్రజలకు మరింత మేలు చేయగలుగుతుంది. పదేండ్లు ప్రతిపక్షాన్ని బతకనివ్వని పార్టీ, ఇవాళ నైతికత కోల్పోయిన ప్రతిపక్షంగా మారింది. తెలంగాణకు కొంతైనా నిజాయితీ కలిగిన ప్రతిపక్షం ఎంత అవసరం ఉన్నదో.. బీఆర్ఎస్ యజమానులు ప్రజల కోసం కాకుండా తమ కోసం మాత్రమే పోషిస్తున్న ప్రతిపక్ష పాత్రను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది! ఒక సుందరయ్య, వాజ్‌పేయి లాంటి నిఖార్సైన ప్రతిపక్ష నేత లేకపోయినా కాస్తంతైనా నిజాయితీ ఉన్న ప్రతిపక్ష నేత తెలంగాణకు ఎప్పటికైనా అవసరమే!
అభాసుపాలు
రాష్ట్రంలో ఏ సమస్యపై మాట్లాడినా బీఆర్ఎస్ను నైతికత వెక్కిరిస్తున్నది. ఈ దుస్థితి నిజంగా ఏ ప్రతిపక్షానికీ రాకూడదు. ఎందుకంటే, అది ప్రజలకు నష్టం కాబట్టి! గత 16 నెలలుగా ప్రభుత్వ తప్పిదాలపై బీఆర్ఎస్ చేస్తున్న ఏ విమర్శలోనూ నైతికత కనిపించకపోవడం ఆ పార్టీ రాజకీయ దుస్థితికి అద్దం పడుతుంది. పదేండ్లు అధికార పక్షంగా తానే చేసిన తప్పులను, ఇపుడు ప్రతిపక్షంగా మారి అవే తప్పులను ప్రశ్నించడమే ప్రజలు నవ్వుకునే పరిస్థితి తయారయింది. అధికారంలో ఉన్నపుడు చక్కగా పనిచేసి ఉంటే, ఇవాళ ప్రతిపక్షంగా మారి చేస్తున్న విమర్శలకు విలువుండేది! ఇవాళ అవి విలువలు లేని విమర్శలుగా అభాసుపాలవుతున్నాయి. ఉదాహరణకు, బీఆర్ఎస్ హయంలో పెండింగ్పడిన సర్పంచుల బిల్లులపై, ఇపుడు ప్రతిపక్షంగా మారిన అదే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులతో ధర్నా చేయించడం చూసి ప్రజలు నవ్వుకున్న పరిస్థితి! బీఆర్ఎస్ పాలనలో ఏర్పడిన ఫీజురియింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రతిపక్షంగా మారాకా అదే బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, వినేవారే ఇబ్బంది పడుతున్న పరిస్థితి!
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్