
చికెన్ ధరలు భారీ స్థాయిలో పెరిగినా పౌల్ట్రీ రైతులకు మాత్రం కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. రెండు కిలోల కోడిని పెంచేందుకు 40 రోజుల సమయం పడుతుండగా.. ఇందుకు రూ.200 వరకు ఖర్చు అవుతుంది. చికెన్ సెంటర్లకు కోళ్లను సప్లై చేసే ట్రేడర్లు మాత్రం కిలోకు రూ.80, రూ.100 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఏడాది పొడవునా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రేడర్లు, సెంటర్ల నిర్వాహకులు ఎవరి మార్జిన్ వారు చూసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారని, రేటు తగ్గినప్పుడల్లా ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పెరిగిన రేట్లు కూడా కంపెనీలు, చికెన్ సెంటర్ల నిర్వాహకుల సృష్టేనని, తమకు మాత్రం ఎప్పటిలాగే కిలోకి రూ. 110 నుంచి రూ. 120 మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు.
రెండు నెలలుగా చికెన్ ప్రియులను వెంటాడిన బర్డ్ ఫ్లూ భయం క్రమంగా తొలగిపోతోంది. దీంతో సాధారణ రోజుల్లాగే చాలా మంది చికెన్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చికెన్‌కు డిమాండ్ పెరిగందన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదనుగా చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఒక్కొక్కరు ఒక్కో ధరకు అమ్ముతున్నారు.
►ALSO READ | కృష్ణ జింకల మాంసం అమ్ముతూ దొరికిపోయారు.. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు అరెస్టు
కరీంనగర్‌లోనే కొన్ని చోట్ల కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.250 ఉంటే.. మరికొన్ని చోట్ల రూ.270, రూ.300 వరకు అమ్ముతుండడం గమనార్హం. హైదరాబాద్‌లోనూఏరియాకో విధంగా రేట్లు ఉన్నాయి. ధర భారీగా పెరగడంతో కేజీ చికెన్ తీసుకుందామని వచ్చిన వారు.. అర కేజీ, ముప్పావు కేజీకే పరిమితం అవుతున్నారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు మాత్రం కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగాయని చెబుతున్నారు.