ఎటు చూసినా ఎడారి.. చుట్టూ ఇసుక మేటలు.. పలకరించడానికి ఒక్క వ్యక్తి కూడా కనిపించరు. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే తెలంగాణ కార్మికులకు ఎదురయ్యే పరిస్థితి ఇది. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి ఎక్కువగా ఉపాధి కోసం నిరుద్యోగులు, కార్మికులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలు ఉపాధి కోసం యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలకు వలస వెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పంటలు సరిగా పండక, స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబ పోషణ కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుని మరీ విదేశాలకు వెళుతున్నారు. కార్మికులను ఏజెంట్లు మోసం చేస్తుండటంతో నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
కేసీఆర్ పాలనలో నెరవేరని హామీలు
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తన ప్రసంగాల్లో తరచూ బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేసి అధికారంలోకి వచ్చారు. పదేండ్లు పరిపాలించిన కేసీఆర్ గల్ఫ్ కార్మిక కుటుంబాలకు రిక్తహస్తం చూపించారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని, 500 కోట్ల రూపాయలతో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్ పదేండ్ల పాలనలో సంక్షేమబోర్డు ఏర్పాటు ఆలోచన కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారానే గల్ఫ్ దేశాలకు వలసలు తగ్గుతాయని చెప్పిన కేసీఆర్ అధికారంలో ఉండగా వలసలు తగ్గించి యువతకు ఉపాధి మార్గాలు చూపలేకపోయారు. గల్ఫ్ దేశాల్లో మరణిస్తే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. 2014లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (Tomcom )ను ఏర్పాటు చేసింది. కార్మికుల స్కిల్స్ డెవలప్ చేసి, ప్రభుత్వం ద్వారా విదేశాలకు పంపించే లక్ష్యం అని చెప్పుకున్నారే కానీ ఏనాడూ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు 5వేల మంది గల్ఫ్ దేశాల్లో మరణించారు. వారందరికీ ఎలాంటి నష్టపరిహారం అందించలేదు.
జైళ్లలో 4,755 మందికి పైగా తెలంగాణ కార్మికులు
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015లో 36,006, 2016లో 24,652 , 2017లో 8,819 మంది తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. 2021లో ఈ సంఖ్య 4,375కు తగ్గింది. మళ్లీ 2022 అక్టోబరు నాటికి 9,576 మందికి పెరిగింది. 2015తో పోలిస్తే గల్ఫ్ దేశాలకు వెళ్లే వలసలు తగ్గినట్లు కనిపిస్తున్నా వాస్తవాలు వేరేలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వల్ల నీటి లభ్యత పెరిగిందని, గల్ఫ్ దేశాల నుంచి కార్మికులు వెనక్కి వస్తున్నారని కేసీఆర్ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ, వాస్తవానికి గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులు ఎక్కువగా భారత ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోరని, అధికారిక గణాంకాలు తక్కువగా ఉన్నాయన్నది ఏజెంట్లు చెప్పే మాట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 82 దేశాల్లో 8,348 పైగా మంది భారతీయులు విదేశీ జైళ్లలో ఉన్నారు. అత్యధికంగా తెలంగాణకు చెందిన 4,755 పైగా కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని జైళ్లు, డిపోర్టేషన్ కేంద్రాల్లో 550 మందికి పైగా కార్మికులు ఖైదీలుగా ఉన్నారు. మలేషియా జైళ్లలో 635, యూఏఈలో 1,935, సౌదీ అరేబియాలో 1,369, ఖతార్‌లో 690, కువైట్‌లో 438, బహ్రెయిన్‌లో 265, ఒమన్‌లో 96 మంది భారతీయ ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు.
గల్ఫ్ కార్మికులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
వలస కార్మికుల విడుదల, బాగోగులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శ కూడా ఉంది. నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, కమ్మర్పల్లి, ధర్మపురి, వేములవాడ, కరీంనగర్, సిరిసిల్ల, ఆర్మూర్ ప్రాంతాల నుంచి అత్యధికంగా వలసలు ఉంటాయి. స్థానిక ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఏనాడూ వారి సమస్యలపై మాట్లాడింది లేదు. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్, మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రత, ECR, ECNR పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు ప్రమాద బీమా, పెన్షన్, పునరావాసం కల్పించాలని కేంద్ర ప్రభుత్వ నాయకులను గల్ఫ్ కార్మికులు కోరినా నామ మాత్రపు హామీలతో మభ్యపెట్టి కాలం గడిపారు తప్ప న్యాయం చేయలేదు.
వలస కార్మికులకు కాంగ్రెస్ బాసట
తెలంగాణకు చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటోంది. గల్ఫ్ దేశాల్లో కార్మికులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. గల్ఫ్ కార్మికుల కష్టనష్టాలను అధ్యయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసింది. గల్ఫ్ వర్కర్ల కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి సెల్ ఏర్పాటు చేసింది. గల్ఫ్ కార్మికుల పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో ప్రాధాన్యతనివ్వడం వంటి అంశాలతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా మార్చుతున్న నేపథ్యంలో వలసలు కూడా తగ్గే అవకాశం ఉంది. యువత భవిష్యత్ కు కాంగ్రెస్ భరోసాగా నిలుస్తోంది.
- ఇందిరా శోభన్,
రాష్ట్ర కాంగ్రెస్
సీనియర్ నాయకురాలు