![ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రీమియర్ లీగ్.. ప్రతి ఉమ్మడి జిల్లాకు రూ. కోటి ఫండ్](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-premier-league-from-this-year-for-each-joint-district-rs-one-crore-fund_OU85kgzvHx.jpg)
- హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ వెల్లడి
- అపెక్స్ కౌన్సిల్‌లో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యంగ్ క్రికెటర్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చి ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) పేరిట ఫ్రాంచైజీ టీ20 లీగ్‌ను ఈ ఏడాది నుంచి తిరిగి ప్రారంభిస్తామని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ ఎ. జగన్‌మోహన్ రావు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రతి ఉమ్మడి జిల్లాకు కోటి రూపాయల చొప్పున ఫండ్ కేటాయిస్తున్నట్టు తెలిపారు.
ఈ మేరకు శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఐపీఎల్ తర్వాత యువ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2018లో వివేక్ వెంకటస్వామి హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జి. వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ టీ20 లీగ్ (టీటీఎల్) నిర్వహించగా సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం టీమిండియా టీ20 టీమ్‌లో కీలక ప్లేయర్‌గా మారిన తిలక్ వర్మ టీటీఎల్‌తోనే వెలుగులోకి వచ్చాడు. కానీ, తర్వాత వచ్చిన హెచ్‌సీఏ పాలక వర్గం ఆ లీగ్‌ను కొనసాగించలేకపోయింది.
ఇన్నేళ్ల తర్వాత స్టేట్ లీగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇక, ప్రతి ఉమ్మడి జిల్లాలో పది ఎకరాలు కొనుగోలు చేసి కొత్త స్టేడియాలను నిర్మిస్తామని, అప్పటివరకూ గ్రౌండ్స్‌ను లీజుకు తీసుకుంటామని జగన్ చెప్పారు. ‘డొమెస్టిక్, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రాణిస్తున్న రాష్ట్ర క్రికెటర్లను సత్కరించేందుకు మార్చిలో హెచ్‌సీఏ అవార్డుల వేడుక నిర్వహిస్తాం. అదే నెలలో ఏజీఎం ఉంటుంది. ఉప్పల్ స్టేడియాన్ని ఆధునీకరించి, మల్టీ లెవల్ పార్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం’ అని తెలిపారు. ఈ సమావేశంలో సెక్రటరీ దేవ్‌రాజ్, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, వైస్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ పాల్గొన్నారు.