- భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబుపై అనుచరుల ఒత్తిడి
- త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడి
భైంసా, వెలుగు: స్వరాష్ట్ర సాధన కోసం మీరు సీఎం కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయినా మీకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదు.. ఇక కారు దిగడమే బెటర్’ అని భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబుపై అనుచరగణం ఒత్తిడి తీసుకువస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో తనపై తప్పుడు ప్రచారం చేశారని నియోజకవర్గ పార్టీ నేతల తీరుపై రాజేశ్‌బాబు సైతం తీవ్ర అసంతృత్తితో ఉన్నారు.
కొంత కాలంగా స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో ఆయనకు విభేదాలు కొనసాగుతుండడంతో ఆయన వర్గమే ఇదంతా చేసిందని రాజేశ్ భావిస్తున్నారు. జిల్లాలోనే గిరిజన, లంబాడా సంఘాలే కాకుండా అన్ని వర్గాల వారు వారం, పదిరోజుల పాటు ఆందోళనలు చేస్తే.. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కనీసం స్పందించలేదు. దీంతో రాజేశ్ బాబుతో పాటు ఆయన అనుచరగణం ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో విఠల్ రెడ్డి, ఆయన అనుచరులపై ఇండైరెక్ట్‌గా రాజేశ్ బాబు మండిపడ్డారు. ఎవరినీ వదలనని, అంతు చూస్తానని హెచ్చరించారు.
పార్టీ మారితే మంచిదని..
శుక్రవారం లోకేశ్వరం మండలం రాజేశ్ తండాలో తన అనుచరగణంతో ఆయన ప్రత్యేకంగాసమావేశమయ్యారు. ముథోల్, బాసర, లోకేశ్వరం మండలాలకు చెందిన బీఆర్ఎస్అసమ్మతి నేతలతో పాటు పలు పార్టీల కార్యకర్తలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాసర మాజీ ఎంపీపీ భర్త సాయినాథ్, ముథోల్మాజీ జడ్పీటీసీ భర్త నర్సాగౌడ్నేతృత్వంలోని పలువురితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ మారాలని శ్రేణులు ఆయనకు సూచించారు. పార్టీ మారితేనే సత్పలితాలు వస్తాయని ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్అధిష్ఠానం నుంచి ఆహ్వానాలు అందుతున్నట్లు సమాచారం. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌కు రాగానే ఆయనతో రాజేశ్ బాబు భేటీ అయ్యి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ముథోల్ బీఆర్ఎస్లో అసమ్మతి
ముథోల్ బీఆర్ఎస్లో కొంతకాలంగా అసమ్మతి నెలకొంది. ఇప్పటికే ముథోల్ మాజీ జడ్పీటీసీ భర్త నర్సాగౌడ్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి ఏ పార్టీలో చేరాలోనని ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మళ్లీ టికెట్ కేటాయించొద్దని సీనియర్ లీడర్లు సోలంకి భీంరావు, జీవీ రమణరావు, పండిత్పటేల్ తదితరులు కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్‌కు కంప్లైంట్ చేశారు. అయినా మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడంతో వారంతాతీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో అసంతృప్తి నేత ఏఎంసీ చైర్మన్రాజేశ్ బాబు కూడా పార్టీ వీడితే ముథోల్‌లో కారుకు నష్టాలు తప్పవు.