- భారంగా మారిన 6,541 ఆలయాల నిర్వహణ
- రెండు నెలలకు కలిపి రూ.13.08 కోట్లు పెండింగ్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీప నైవేద్యం (డీడీఎన్) కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రెండు నెలలుగా ఆగిపోయాయి. దీంతో అర్చకులు దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలు, అర్చనలు, నివేదనలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి సరుకులు తెస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీడీఎన్ స్కీమ్‌లో 6,541 ఆలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా 6,541 ఆలయాలు ధూప, దీప నైవేద్యం స్కీమ్‌లో ఉన్నాయి. ఈ ఆలయాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆలయానికి నెలకు రూ.10 వేల చొప్పున అందిస్తోంది. ఈ మొత్తంలో రూ.7 వేలు అర్చకుడికి భృతికి కాగా మిగతా రూ.3 వేలు స్వామి వారి ధూప, దీప, నైవేద్యానికి కేటాయించాలి. అయితే ఈ నిధులు ఆగిపోవడంతో ఆలయ నిర్వహణ భారంగా మారింది. కొందరు అర్చకులు సరుకుల కోసం అప్పులు చేయడంతో పాటు దాతల సహకారంతో ఆలయ నిర్వహణ చేపడుతున్నారు. నిధులు మంజూరు చేయాలని ఎండోమెంట్ ఆఫీసర్లకు విన్నవించినా పట్టించుకోవడం లేదని అర్చకులు వాపోతున్నారు.
రూ.13.08 కోట్లు పెండింగ్
రాష్ట్రంలో 6,541 ఆలయాలకు డీడీఎన్ పథకంలో భాగంగా ప్రతీ నెలా రూ.6.54 కోట్ల నిధులు విడుదల చేస్తున్నది. రెండు నెలలుగా ఎండోమెంట్ నుంచి నిధులు రాకపోవడంతో మొత్తం రూ.13.08 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. ప్రస్తుతం జనవరి నెల కూడా పూర్తి కావొస్తోంది. ఈ నెలలో నిధులు విడుదల చేయకపోతే మూడు నెలల పెండింగ్ నిధులు మొత్తం రూ.19.62 కోట్ల అవుతాయని అంటున్నారు.
ఉద్దెరకు తెస్తున్నం
ధూప, దీప, నైవేద్యాలకు స్థానికంగా కిరాణ దుకాణంలో ఉద్దెరపై సరుకులు తెస్తున్నం. రెండు నెలల నుంచి నిధులు రావడం లేదు. అప్పు పెరగడంతో సరుకులు ఇవ్వలేమని దుకాణదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడంతో ఆదాయం రావడం లేదు. గౌరవ వేతనంతోనే కుటుంబం గడిచేది.. పైసలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం స్పందించి నిధులు రిలీజ్ చేయాలె. మేము పస్తులున్నా స్వామికి నిత్యపూజలు ఆగకూడదని ఉద్దెరకు సరుకులు తెస్తున్నం.
- పొదిల భాస్కర్‌శర్మ, కోదండరామాలయం అర్చకుడు, రావికంపాడు
అటెండెన్స్ ఎప్పటికప్పుడు పంపిస్తున్నం..
ప్రతీ నెల డీడీఎన్ పథకం అమలయ్యే ఆలయాల నుంచి అటెండెన్సులు తెప్పించి హెడ్ ఆఫీస్‌కు పంపుతున్నం. రెండు నెలల నుంచి నిధులు రిలీజ్ కావడం లేదు. కారణాలు తెలియదు. ప్రస్తుతం అర్చకులు ఆలయాల్లో కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా సర్దుబాటు చేసుకుంటున్నారు. నిధులు రాగానే వారికి చెల్లిస్తం.
- వీరస్వామి, అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్, ఖమ్మం