ముగిసిన తెలంగాణ జైళ్ల శాఖ స్పోర్ట్స్ మీట్

ముగిసిన తెలంగాణ జైళ్ల శాఖ స్పోర్ట్స్ మీట్
  • ఆటలతోనే మానసిక, శారీరక ఉల్లాసం: సీఎస్

మలక్ పేట, వెలుగు: క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిచడంతోపాటు క్రమశిక్షణ, సమన్వయం వంటి విలువలు పెంచుతాయని సీఎస్ శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ చంచల్ గూడలోని సికా పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ జైళ్లశాఖ 7వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి సీఎస్ శాంతి కుమారి, తెలంగాణ జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా, తెలంగాణ జైళ్లశాఖ ఐజీలు రాజేశ్, మురళీ బాబు, డీఐజీ శ్రీనివాస్, సంపత్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

క్రీడా పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం శాంతికుమారి మాట్లాడారు.  స్పోర్ట్స్ మీట్ లో  రాష్ట్రంలోని 37 జైళ్ల నుంచి 250 మంది సిబ్బంది పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. మహిళా సిబ్బంది కూడా జైళ్లశాఖ స్పోర్ట్ మీట్ లో పాల్గొనడం మంచిపరిణామమన్నారు. దాదాపు 26 ఇన్ డోర్, అవుట్ డోర్ గేమ్స్ లో గెలిచి చంచల్ గూడ కేంద్ర కారాగారం మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు.

బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఢిల్లీ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. తెలంగాణ జైళ్ల శాఖ దేశంలో ఎక్కడా లేని విధంగా ఖైదీలతో కూడా క్రీడా పోటీలు  నిర్వహింస్తున్నదని సీఎస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో చంచల్ గూడ జైల్ సూపరింటెండెంట్ నవాబ్ శివ కుమార్, మహిళా జైల్ సూపరింటెండెంట్ వెంకట లక్ష్మీ, శ్రీ మాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.