జైళ్ల శాఖ వార్షిక స్పోర్ట్స్ మీట్ షురూ.. మూడు రోజుల పాటు స్పోర్ట్స్ మీట్

జైళ్ల శాఖ వార్షిక స్పోర్ట్స్ మీట్ షురూ.. మూడు రోజుల పాటు స్పోర్ట్స్ మీట్

మలక్ పేట, వెలుగు: స్పోర్ట్స్ మీట్ వల్ల సిబ్బందిలో పట్టుదల, ఆలోచన శక్తి , శారీరక దృఢత్వం వంటి లక్షణాలు పెంపొందుతాయని తెలంగాణ హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్త, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అన్నారు. క్రీడల్లో పాల్గొంటే మానసిక పరిపక్వత అభివద్ధి చెందుతుందన్నారు. బుధవారం హైదరాబాద్ చంచల్ గూడ జైల్ ప్రాంగణంలోని సికా మైదానంలో 7వ రాష్ట్ర స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ను జైల్ డీజీ సౌమ్య మిశ్రాతో కలసి హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్త ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీజీ సౌమ్యా మిశ్ర మాట్లాడుతూ.. జైళ్ల వ్యవస్థలో పోలీసు సిబ్బందికి మాత్రమే కాకుండా ఖైదీలకు కూడా క్రీడలు, ఫిట్ నెస్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఖైదీలు, తెలంగాణ స్పెషల్ పోలీసులకు వాలీబాల్ పోటీలను నిర్వహించినట్లు వివరించారు. మూడు రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ జరగనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐజీ రాజేశ్ బాబు, ఎన్. మురళీ బాబు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ డీ.శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.సంపత్ తదితరులు పాల్గొన్నారు.