తెలంగాణాలో ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్

తెలంగాణాలో ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్
  • కాలేజీల మేనేజ్​మెంట్ల సంఘం ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్​ డిగ్రీ, పీజీ కాలేజీలు ఆందోళన బాటపట్టాయి. మూడేండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కోరుతూ మంగళవారం నుంచి కాలేజీల నిరవధిక బంద్​కు పిలుపునిస్తున్నట్టు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల మేనేజ్​మెంట్ల సంఘం (టీపీడీఎంఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, యాద రామకృష్ణ తెలిపారు.

సోమవారం సెక్రెటేరియెట్​లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి వినతిపత్రం అందించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు  ఆర్​.కృష్ణయ్యను కలిసి బంద్​కు మద్దతు కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సుమారు 25వేల మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం వివిధ రకాల విద్యాసంస్థలను స్థాపించి, సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. ఏటా సుమారు 2,500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కాలేజీలకు సర్కారు కేటాయిస్తుందన్నారు. అయితే,  2021– -22 సంవత్సరంలో 20% , 2022 – -23 లో 70%,  2023– -24 లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. సుమారు పదినెలల నుంచి రూ.1200 కోట్ల బకాయిలకు సంబంధించి టోకెన్లు రిలీజ్ చేసి, ఇప్పటికీ నిధులు మాత్రం కాలేజీల ఖాతాల్లో జమ చేయలేదని తెలిపారు.

దీంతో అద్దెలు, సిబ్బంది జీతాలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని, తెచ్చిన అప్పులు కట్టలేక.. కొత్త అప్పులు దొరక్క కాలేజీల నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే తమ పరిస్థితిపై అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లతోపాటు స్టేట్ కౌన్సిల్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. విధిలేని పరిస్థితిలోనే కాలేజీలు బంద్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఫీజు రీయింబర్స్ మెంట్​ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడ్తామని ఎస్​ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్​ మూర్తి, నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.