హైదరాబాద్: ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కు సెంటర్స్ ఇచ్చేది లేదని ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అబిడ్స్‌లోని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారికి అసోసియేషన్ నాయకులు నోటీసులు అందించారు. ఎగ్జామ్ సెంటర్స్‌లో సీసీ కెమెరాలు పెట్టాలని సమయం ఇవ్వకుండా తమపై ఒత్తిడి చేస్తున్నారని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీశ్ అన్నారు.
కార్పొరేట్ కాలేజీలపై లేని నిబంధనలు బడ్జెట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు అధికారులు రుద్దుతున్నారని విమర్శించారు. మూడేండ్లుగా స్కాలర్ షిప్‌లు అందడం లేదని, అప్పులతో కాలేజీలను నడిపిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో సీసీ కెమెరాల ఏర్పాటు తమకు ఆర్థిక భారంగా మారిందని వెల్లడించారు. వాటిని ఏర్పాటు చేసుకునేందుకు సమయం కూడా ఇవ్వకుండా బోర్డు సెక్రటరీ బ్లాక్ బెయిల్ చేసినట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు.
ALSO READ | ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!
బోర్డు పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనేది పక్కన పెడితే.. తామే పరీక్షా కేంద్రాలకు సెంటర్లను ఇవ్వొద్దని నిర్ణయించినట్టు చెప్పారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తీరుతో సర్కారుకూ చెడ్డపేరు వస్తున్నదని ఆరోపించారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ బాధ్యత నుంచి ఆయనను తప్పించాలని గౌరీ సతీశ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్పరీక్షలు, మార్చి 5 నుంచి 25 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి.