- విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో మేనేజ్మెంట్ల చర్చలు సఫలం
- బకాయిల రిలీజ్‌కు సర్కారు హామీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీల బంద్‌ను విరమిస్తున్నట్టు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీపీడీఎంఏ) ప్రకటించింది. గురువారం సెక్రటేరియెట్‌లో మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్యతో కలిసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, యాద రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేశ్వర్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేనేజ్ మెంట్ల సమస్యలను ఆయనకు వివరించారు.
రాష్ట్రంలో మూడేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఐదారు నెలల నుంచి సుమారు రూ.1,200 కోట్ల బకాయిల రిలీజ్‌కు టోకెన్లు విడుదలైనా.. ఇప్పటికీ ఆ డబ్బులు మేనేజ్మెంట్ల ఖాతాల్లో పడలేదన్నారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. బకాయిల విడుదలకు త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో బంద్ విరమిస్తున్నట్టు మేనేజ్మెంట్లు ప్రకటించాయి.