- ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకుంటున్నడు
- ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం కానియ్యం
- భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
- హైదరాబాద్ దాటి సంగారెడ్డి జిల్లాలోకి యాత్ర
హైదరాబాద్ / కూకట్పల్లి / సంగారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై దృష్టి సారించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో ఆయన ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర బుధవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. పటాన్ చెరు, ముత్తంగి, రుద్రారం, గణేశ్ గడ్డ వరకు యాత్ర కొనసాగింది. ముత్తంగి చౌరస్తాలో జరిగిన సభలో రాహుల్ మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని, ఇంజినీరింగ్ చదివిన వాళ్లు కూడా కూలీలుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒకే తరహాలో పని చేస్తున్నారని అన్నారు. వాళ్లిద్దరూ కలిసే పని చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందని, దీనిని తాను స్వయంగా చూశానన్నారు.
ప్రభుత్వ సంస్థలను కాపాడ్తం
ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్ఈఎల్, బీడీఎల్ లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. ఉద్యోగులను భయపెట్టి ఈ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, ఈ రెండు సంస్థల ఉద్యోగులతో మాట్లాడిన తర్వాత తనకు ఈ విషయం తెలిసిందన్నారు. ఈ సంస్థలు దేశ సంపద అని, నాడు ఇందిరా గాంధీ హయాంలో ప్రజల ప్రయోజనాల కోసం వీటిని ఏర్పాటు చేస్తే.. మోడీ సర్కారు ఇప్పుడు వారి మిత్రులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమన్నారు.
ఎంత నడిచినా అలసట రావట్లే
అందరినీ భయంలో ఉంచి దేశాన్ని అమ్మడమే లక్ష్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పని చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో దేశ వెన్నెముకను మోడీ విరగ్గొట్టాడని విమర్శించారు. రైతులు, చిరు వ్యాపారుల నడ్డి విరిచి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. యాత్రలో ఎవరితో మాట్లాడినా సమస్యలను ఏకరువు పెడుతున్నారని, మోడీకి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారని తెలిపారు. జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తోందన్నారు. రోజూ కిలోమీటర్ల కొద్దీ నడిచినా అలసట రావడం లేదని చెప్పారు. పాదయాత్ర ప్రారంభించి 55 రోజులైనా ఈ రోజే మొదలుపెట్టినట్లు అనిపిస్తోందన చెప్పారు. కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
రాహుల్‌తో కలిసి నడిచిన పూజా భట్
బాలీవుడ్ నటి పూజా భట్ కూడా బుధవారం రాహుల్ తో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు. యాత్ర ప్రారంభం నుంచి 10 కిలోమీటర్లు రాహుల్‌తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుకుంటూ పాదయాత్ర చేశారు.
కింద పడిపోయిన గీతారెడ్డి
రాహుల్ యాత్రలో మాజీ మంత్రి గీతారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పటాన్ చెరు వద్ద రాహుల్ ను కలిసేందుకు ఆమె సెక్యూరిటీని దాటుకుని వెళ్తుండగా సిబ్బంది అడ్డుకున్నారు. కార్యకర్తలు ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో పోలీసులు గీతారెడ్డిని పక్కకు తోసేశారు. దీంతో ఆమె కింద పడిపోయారు. ఆమెను కార్యకర్తలు గుర్తించి పోలీసులకు చెప్పడంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు ఎత్తుకుని పక్కకు తీసుకెళ్లారు. పక్కన కూర్చోబెట్టి మంచినీళ్లు అందించారు. ఈ ఘటనలో గీతారెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె తన సొంత వెహికల్ లో ముత్తంగి వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు వెళ్లిపోయారు.
పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి
జోడో యాత్రలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ నేతతో కలిసి నడిచేందుకు వస్తే పోలీసులు రానివ్వకుండా, తోసివేస్తున్నారని మండిపడుతున్నారు. బుధవారం తోపులాటలో మహరాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రావత్ కంటికి గాయం కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, రాహుల్ టీమ్ లో సమన్వయ లోపమే ఆ పార్టీనేతలకు ఇబ్బందిగా మారినట్లు చెప్తున్నారు.
రాష్ట్రంలో ఎనిమిదో రోజు యాత్ర సాగిందిలా..
హైదరాబాద్‌లో రెండ్రోజులు సాగిన భారత్ జోడో యాత్ర బుధవారం సిటీ దాటి సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. రాష్ట్రంలో 8వ రోజు రాహుల్ యాత్ర కొనసాగించారు. బుధవారం ఉదయం 6 గంటలకు బోయిన్ పల్లి నుంచి వెహికల్లో వచ్చిన ఆయన బాలానగర్ నుంచి యాత్రను కొనసాగించారు. కూకట్ పల్లి వై జంక్షన్, కేపీహెచ్‌బీ కాలనీ, మియాపూర్, బీహెచ్ఈఎల్, ఆర్సీపురం, పటాన్ చెరు, ముత్తంగి, రుద్రారం మీదుగా గణేశ్ గడ్డ వరకు సాగింది. రాహుల్ కు బోనాలు, పోతరాజుల నృత్యాలతో స్వాగతం పలికారు. చెర్నకోలా చేతిలో పట్టుకొని పోతరాజులతో కలిసి ఆయన స్టెప్పులేశారు. యాత్రలో ఓ మహిళ కిందపడిపోగా.. ఆమెను దగ్గరకు పిలిపించుకుని నీళ్లు తాగించారు. పక్కనే పడిపోయిన ఆమె చెప్పును చేతితో అందించారు.
జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల భుజంపై చేతులు వేసి నడుస్తూ ముచ్చటించారు. నిజాంపేట్‌లోని పిస్తా హౌస్‌లో చాయ్ తాగారు. మదీనగూడలోని కినారా గ్రాండ్ హోటల్లో లంచ్ బ్రేక్ తీసుకున్నారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్ తదితర కంపెనీల ఉద్యోగులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను కలిశారు. మియాపూర్‌లో నివసిస్తున్న ఏపీకి చెందిన ప్రజలు ‘సేవ్ ఏపీ-సేవ్ అమరావతి’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని యాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం ఇక్రిశాట్ వద్ద ఓ పిల్లాడితో రాహుల్ బౌలింగ్ చేస్తూ క్రికెట్ ఆడారు. రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్, జర్నలిస్టులు సరదాగా ఫీల్డింగ్ చేశారు.