ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తిలో ఎస్సీ కో- ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, నాగర్‌కర్నూల్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, గద్వాలలో ఢిల్లీలో అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, నారాయణపేటలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి జెండాను ఎగురవేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు.
మహబూబ్ నగర్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి
వనపర్తి: ప్రజల భాగస్వామ్యంతోనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఎస్సీ కో -ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ తెలిపారు. వనపర్తి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 77 ఏండ్ల కింద ఇదే రోజున రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. జిల్లాలో 37,373 మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 6,824 మంది పేదలు చికిత్స పొందారన్నారు.
మూడు విడతల్లో జిల్లాలో 53,244 మంది రైతులకు రూ.423.08 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ మహేశ్ పాల్గొన్నారు.
అన్నిరంగాల్లో డెవలప్ చేస్తున్నాం
నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని, ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి,చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డీఎఫ్ వో రోహిత్ గోపిడి పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
నారాయణపేట: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ గుర్నాథ్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, ఎస్పీ యోగేశ్ గౌతమ్‌తో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. జిల్లాలో రూ.490 కోట్లను మాఫీ చేసి 57,232 మంది రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించామన్నారు.
48 గంటల్లో హామీల అమలు
గద్వాల: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ 48 గంటల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చరిత్ర సృష్టించిందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ నెరవేర్చడంతో పథకాల అమలు ప్రారంభించారని గుర్తు చేశారు. జిల్లాలో 45,202 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.392.79 కోట్లు జమ చేసినట్లు చెప్పారు స్మృతివనంలో అమరవీరుల స్తూపానికి కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడుతో కలిసి నివాళులు అర్పించారు.