- వారం రోజుల పాటు నిర్వహణ
- తొలిరోజు క్వాలిఫయింగ్ పేపర్‌గా ఇంగ్లిష్
- తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో మిగతా పేపర్లు
- షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ
- పరీక్షా కేంద్రాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోనే..
హైదరాబాద్, వెలుగు : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. తొలిరోజు 21న క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ తర్వాతి ఆరు వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు కొనసాగనున్నాయి. అన్నీ పరీక్షలూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరీక్ష మినహా మిగిలిన అన్ని పేపర్లను తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియంలలో రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంది.
అభ్యర్థులు ఏ మీడియంను కోరుకున్నారో ఆ ప్రకారమే రాయాల్సి ఉంటుంది. కొన్ని పేపర్లు ఒక మీడియంలో రాసి, మరికొన్ని వేరే మీడియంలో రాస్తే ఆ అభ్యర్థిని ఫలితాల్లో పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఒకే జవాబు పత్రాన్ని సగం ఒక మీడియంలో, మరికొంత మరో మీడియంలో రాసినా అది చెల్లుబాటు కాదని స్పష్టత ఇచ్చింది. పరీక్షా కేంద్రాలు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉంటాయని ప్రకటించింది.
ఇంగ్లిష్ పేపర్ కేవలం టెన్త్ ఇంగ్లిష్ సబ్జెక్టు స్టాండర్డ్ లో సిలబస్ ఉంటుందని వివరించింది. ఆరు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ర్యాంకింగ్ పైనల్ అవుతుందని.. ప్రతీ పేపర్‌కు 150 మార్కులు ఉంటాయని వెల్లడించింది. కాగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
నేడు గ్రూప్1 ప్రిలిమ్స్ ప్రిలిమినరీ కీ
గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రిలిమినరీ కీని గురువారం వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ప్రాథమిక కీని టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఈ ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంటుందంది. అభ్యర్థులు లాగిన్ అయి.. కీని చూసుకోవాలని సూచించారు.
ప్రాథమిక కీపై అభ్యంతరాలను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఈమెయిల్ ద్వారా వచ్చే అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.