హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల కారణంగా అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులు సెలవు ప్రకటించింది. బుధ, గురువారాలు రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సూచించారు.
ALSO READ :గట్టి వానొస్తే .. మునుగుడే!
సీఎం ఆదేశాలతో స్కూళ్లు, కాలేజీలన్నింటికీ రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు ఇచ్చారు. అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాలని ఆదేశించారు. బుధవారం జరిగే శాలసిద్ధి, ఎఫ్ఎల్ఎన్ శిక్షణా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. 27,28 తేదీల్లో జరిగే తెలుగు యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడించారు.