- నేడు భూపాలపల్లి, ములుగుకు ఆరెంజ్ అలర్ట్
- మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- భూపాలపల్లి, ములుగుకు ఆరెంజ్, మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, అది గురువారం నాటికి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్తాయని వెల్లడించింది. గురువారానికి రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇందులో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా మూడు రోజులకు ఆయా జిల్లాలతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్
నల్గొండ, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్ సిటీకి కూడా ఎల్లో అలర్ట్‌ను ఇష్యూ చేసింది. రెండు రోజులపాటు మబ్బులు పట్టి ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.