Weather Alert: ఈ మూడు రోజులు కాస్త రిలీఫ్.. తెలంగాణాలో వర్షాలు.. మూడు డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు..

Weather Alert: ఈ మూడు రోజులు కాస్త రిలీఫ్.. తెలంగాణాలో వర్షాలు.. మూడు డిగ్రీలు తగ్గనున్న టెంపరేచర్లు..
  • నేడు, రేపు వడగండ్ల వానలు
  • పది జిల్లాలకు ఆరెంజ్.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ
  • ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడే చాన్స్​
  • ఈ మూడు రోజులు రెండు మూడు డిగ్రీల మేర తగ్గనున్న టెంపరేచర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం పది జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో వర్షాలు పడుతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. 

శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు, శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్​ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది.  మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

కాస్త తగ్గిన ఉష్ణోగ్రతలు 

గురువారం ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. నిన్నటివరకు 41 నుంచి 42 మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు.. గురువారం 40 డిగ్రీలకు తగ్గాయి. అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లా తాంసిలో 40.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లాలో 40.5, కొత్తగూడెం, భూపాలపల్లి, మహబూబ్​నగర్​ జిల్లాల్లో 40.4, గద్వాల, నిజామాబాద్​ జిల్లాల్లో 40.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతాయని వెల్లడించింది. 

కోతకొస్తున్న పంటలు

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంటలు కోత దశకు వచ్చాయి. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్​ అవుతున్నాయి. మామిడి తోటలు పిందె దశ నుంచి కాయ దశకు వస్తున్నాయి. ఇలాంటి కీలక టైమ్​లో వడగండ్ల వానలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. చెడగొట్టువానలు పడితే వేలాది ఎకరాల్లో పంట నష్టం తప్పదని, పంట పెట్టుబడులు కూడా రాక నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.