మే 2వ వారంలో సింగరేణి థర్మల్ ప్లాంట్​కు శంకుస్థాపన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మే 2వ వారంలో సింగరేణి థర్మల్ ప్లాంట్​కు శంకుస్థాపన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
  • రాజస్థాన్  విద్యుత్ మంత్రి  హీరాలాల్ తో భేటీ 

హైదరాబాద్, వెలుగు: రాజస్థాన్​ ఇంధన సంస్థ సంయుక్త భాగస్వామ్యంలో సింగరేణి  చేపడుతున్న  థర్మల్​ పవర్​ ప్లాంట్​కు వచ్చే నెల 2వ వారంలో  శంకుస్థాపన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్​ ప్రగతి భవన్​లో రాజస్థాన్​ విద్యుత్​ శాఖ మంత్రి హీరాలాల్ తో భట్టి భేటీ అయ్యారు. తెలంగాణ-– రాజస్థాన్  మధ్య గతంలో జరిగిన సోలార్, థర్మల్ విద్యుత్  ఒప్పందాలపై ఇద్దరూ చర్చించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ఫెడరల్  స్ఫూర్తికి గొప్ప నిదర్శనమని భట్టి అన్నారు. 

సింగరేణి, రాజస్థాన్  విద్యుత్  ఉత్పాదన్  నిగమ్  లిమిటెడ్  మధ్య ఇటీవల జరిగిన 3100 మెగావాట్ల విద్యుత్  ప్లాంట్ల ఏర్పాటు ఒప్పందమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో ఒకటైన  800 మెగావాట్ల అల్ట్రా సూపర్  క్రిటికల్  థర్మల్  పవర్ ప్లాంట్  నిర్మాణ పనులకు ఏర్పాట్లు చేయాలని అధికారులను భట్టి ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్లాంట్  నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ కు అప్పగించామని గుర్తుచేశారు. 

అలాగే రాజస్థాన్ లో ఏర్పాటు చేయనున్న 1500 మెగావాట్ల సోలార్  ప్లాంట్  కోసం భూపరిశీలన పూర్తయిందని తెలిపారు. మరోసారి అధికారుల బృందం అక్కడికి వెళ్లి ప్లాంట్  ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇరు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుపై మంచి పురోగతి ఉందని రాజస్థాన్  విద్యుత్  శాఖ మంత్రి హీరాలాల్  సంతృప్తి వ్యక్తం చేశారు.