రసాయన ఎరువుల వాడకం తగ్గించేదెన్నడు? : కూరపాటి శ్రావణ్

రసాయన ఎరువుల వాడకం తగ్గించేదెన్నడు? : కూరపాటి  శ్రావణ్

మన దేశంలో ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి తోడు పంటలను పండించే విషయంలో రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. దేశంలో అత్యధికంగా క్రిమిసంహారక మందులను వినియోగించే రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 4వ స్థానంలో నిలిచిందని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి.

సేంద్రియ సాగు వల్ల కలిగే ప్రయోజనాల గురించి, వచ్చే లాభాల గురించి చాలామంది అన్నదాతలకు అవగహన లేకపోవడం. అలాగే ఇలాంటి సేంద్రియ సాగును అవలంభించే రైతులకు కేంద్ర, - రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అందకపోవడం మరో కారణం. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పంటలను పండించడాని కి ఉపయోగించే రసాయన ఎరువుల వాడకం కూడా అధిక మొత్తంలో ఉంది. 

ఈ విషపూరిత క్రిమిసంహారక పురుగు మందులను ఉపయోగించడం వల్ల మనుషులతో పాటు ఇతర జీవరాశుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. అలాగే పర్యావరణ కాలుష్యం సైతం పెరిగింది. మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం వలన భూసారం దెబ్బతింటుంది. అలాగే పొలాల పక్కన ఉండే చెరువులోని నీళ్లు కూడా ఈ రసాయనాల ద్వారా విషపూరితం అయి ఆ నీటిని తాగే పశువులకు హాని కలుగుతుంది.

నాసిరకం మందులు, కంపెనీల దోపిడీ 

ఏదైనా చిన్న చీడపురుగు పంటలకి పట్టగానే కొన్ని కంపెనీలు తమ ప్రకటనల ద్వారా నాసిరకం, విషపూరిత మందులు బాగా పని చేస్తాయంటూ అన్నదాతలకు అంటగడుతున్నాయి. అలాగే కొన్ని కంపెనీలు లాభాలను సంపాదించుకోవడం కోసం కొంతమంది సినీ నటుల ద్వారా ప్రకటనలు చేయించడం వల్ల వాటికి రైతులు ఆకర్షితులు అయి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయంలో రైతులకు సరైన అవగాహన లేక నకిలీ ఎరువులు, క్రిమిసంహారక మందులను కొనడం వల్ల డబ్బులు వృథా కావడంతో పాటు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదు. 

ఇలాంటి కంపెనీలపై అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ ఏమేరకు ఉన్నదో తెలియదు. సేంద్రియ పద్ధతిలో పంటలను పండించడం వల్ల సాగు ఖర్చులు కూడా భారీగా తగ్గడంతో పాటు రైతులకు అధిక లాభాలు వస్తాయి. రాయితీలతో కూడిన వ్యవసాయ యంత్రపరికరాలను సబ్సిడీ రూపంలో అన్నదాతలకి అందించడం వంటి చర్యలు సమర్థవంతంగా చేపడితే కర్షకులు సేంద్రియసాగు వైపు మొగ్గు చూపుతారు.

ఆహారం, ఆరోగ్యం 

సేంద్రియ సాగుతో రైతులకు అధిక పంట దిగుబడులు రావడంతోపాటు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు మనందరికీ లభ్యమవుతాయి. పైగా ఈ విధమైన సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా భూసారం క్షీణించదు, వాతావరణ కాలుష్యం ఉండదు. అలాగే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. ప్రకృతిలో జీవించే వివిధ రకాల పక్షుజాతులు కూడా వృద్ధి చెందుతాయి. మన దేశానికి వెన్నెముక రైతన్న అని ప్రభుత్వాలు చెబుతున్న వీరికి మేలు జరిగే పనులు మాత్రం చేయడంలో విఫలం అవుతున్నారు. 

విషపూరిత రసాయన ఎరువుల వాడకం వలన పంటలు పండించే రైతులకి కొన్ని రకాల భయంకరమైన ప్రాణాంతక కాన్సర్ వ్యాధులు వ్యాపించి చనిపోతున్నారు.  అలాగే కొన్నిరకాల నకిలీ ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల పంటలకు పట్టిన చీడపురుగులు చనిపోక పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల బారినపడి, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ప్రజలు, పర్యావరణం పట్టవా? 

సేంద్రియసాగు చేసే రైతులందరికీ వారికి కావాల్సిన రుణాలను సకాలంలో అందజేయాలి. సేంద్రియసాగుపై అవగాహన లేని వారికి తగిన శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. ఈ రకమైన సాగును చేస్తున్న నేటి తరం రైతులకు  వీటి సాగుకు సంబంధించి కలిగే ప్రయోజనాల గురించి, వచ్చే లాభాల గురించి, రసాయన ఎరువులు వాడకం  వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలందరికీ తెలిసేలా గ్రామాల వారీగా రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 

రసాయనాల వాడకంలో తెలంగాణ 4వ స్థానం

తెలంగాణ రాష్ట్రం రసాయన ఎరువుల వాడకంలో 4 వ స్థానంలో ఉన్నదంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. సేంద్రియ వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ప్రోత్సహిస్తున్నట్లయితే.. ఏవిధంగా ప్రోత్సహిస్తున్నదో రైతులకు వివరంగా ప్రచారం చేయాలి. సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలేమైనా ఉంటే.. వాటి పట్ల కూడా రైతులకు అవగాహన కల్పించాలి. పాలకులకు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ,  రైతుల పట్ల, రసాయన వ్యవసాయంతో పాడవుతున్న ప్రజల ఆరోగ్యం, పర్యావరణం పట్ల లేకపోవడం దురదృష్టకరం.

- కూరపాటి  శ్రావణ్, కొండాపూర్, జనగామ జిల్లా