- మన రాష్ట్రం నంబర్ వన్ అన్నది అబద్ధం: టీజేఏసీ
- 6 రాష్ట్రాలు, 3 యూటీలు మనకంటే ముందున్నయ్
- సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గణాంకాలే సాక్ష్యం
- 2015 తర్వాత దేశమంతా ఫుల్ కరెంట్
- ప్రస్తుతం 20 రాష్ట్రాలకు కరెంట్ సమస్యల్లేవ్
- మన డిస్కంలను అప్పులపాలు చేశారని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజేఏసీ స్పష్టం చేసింది. కరెంట్ వాడకంలో మన రాష్ట్రం దేశంలో 10వ స్థానంలో ఉందని తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ‘సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక – 2023’ ప్రకారం తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ కంటే 6 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ముందు ఉన్నాయని వెల్లడించింది. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగానికి సంబంధించిన లెక్కలను టీజేఏసీ మీడియాకు వివరించింది. దేశవ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగంలో గోవా మొదటి స్థానంలో ఉండగా, పంజాబ్, ఒడిశా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. తర్వాత గుజరాత్, చత్తీస్ గఢ్, హర్యానా, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయని పేర్కొంది. యూటీల పరంగా చూస్తే.. దాద్రా నగర్ హవేలీ, డామన్డయ్యూ, పుదుచ్చేరి ముందున్నాయని వెల్లడించింది. యూటీలు, రాష్ట్రాలు కలిపి చూస్తే.. దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తొలి 2 స్థానాల్లో ఉన్నాయని, తర్వాత గోవా మూడో స్థానంలో ఉందని పేర్కొంది. వీటన్నింటితో పోలిస్తే తెలంగాణ10వ స్థానంలో నిలిచిందని వివరించింది. 2021–22 ఏడాదికి గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదికను విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కన్నా విద్యుత్ వినియోగ వృద్ధి రేటు దిగజారిందని పేర్కొంది.
తెలంగాణ డిస్కంలు అప్పులపాలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కన్పిస్తుందని, కానీ 2015 తర్వాత దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా మెరుగుపడిందని టీజేఏసీ తెలిపింది. దేశంలో గతంలో మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావడంతో కరెంట్ సప్లై పెరిగిందని, బొగ్గు సరఫరా కూడా పెరగడంతో కరెంట్ సమస్యలు తీరాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు, కరెంటు కోతలు లేవని వెల్లడించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కరెంటును కొనగలిగితే ఏ రాష్ట్రానికీ విద్యుత్ కొరత ఉండే అవకాశం లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం వచ్చాక నంబర్ వన్ అయ్యామంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నదని విమర్శించింది. కొత్త పవర్ ప్రాజెక్టులు ఏవీ పూర్తికాలేదని, కొనుగోళ్లకే పరిమితం కావడంతో డిస్కంలు అప్పుల పాలయ్యాయని టీజేఏసీ వివరించింది.