తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  • సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఆగకుండా వర్షం
  • జలమయమైన కాలనీలు, రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్​
  • మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్​లో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా తెంపులేని వాన కురిసింది.  భారీ వర్షానికి  నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​,కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్​ జారీ చేసింది.

హైదరాబాద్​లోని మారేడుపల్లి, ఖైరతాబాద్, ముషీరాబాద్​, షేక్​పేట, శేరిలింగంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, బేగంపేట, కూకట్​పల్లి, బాలానగర్, కాప్రా, ఆసిఫ్​నగర్, కుత్బుల్లాపూర్, నాంపల్లి, ఆర్సీపురం, అంబర్​పేట, హిమాయత్​నగర్, అల్వాల్, అమీర్​పేట్, తిరుమలగిరి, పటాన్​చెరు, గోల్కొండ, చార్మినార్, సైదాబాద్​తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడ్డది. రోడ్లపై భారీగా వరద  చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా మెట్టుగూడలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

జిల్లాల్లో ముసురు..  

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ముసురు పట్టింది. వనపర్తి, మహబూబ్​నగర్​, నారాయణపేట, వికారాబాద్, నాగర్​కర్నూల్, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్​భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లా మిరస్​పల్లిలో 5.6 సెంటీమీటర్లు, నారాయణపేట జిల్లా నర్వలో 5, వనపర్తి జిల్లా పెబ్బేరులో 5, మహబూబ్​నగర్​ జిల్లా చిన్న చింతకుంటలో 4.5, నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరులో 4.2, వికారాబాద్​జిల్లా బంట్వారంలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

మరో రెండ్రోజులు వానలు.. 

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్​ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజిరిగిరి, మహబూబ్​నగర్​జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్​లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.