ట్రస్మా ఆరోపణలను ఖండించిన విద్యార్థి సంఘాల నాయకులు

మంచిర్యాల : తెలంగాణ రికగ్నైజ్డ్​ స్కూల్స్ మేనేజ్​మెంట్​ అసోసియేషన్​ (ట్రస్మా), స్టూడెంట్​ యూనియన్లకు మధ్య వార్​ మొదలైంది. విద్యార్థి సంఘాల నాయకులు ప్రైవేట్​ విద్యాసంస్థల యాజమాన్యలను బెదిరిస్తూ, బ్లాక్​ మెయిల్​ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ట్రస్మా లీడర్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్​ స్కూళ్లలో లొసుగులను, యాజమాన్యాల అక్రమాలను విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలు చేస్తూ పోలీస్​, విద్యాశాఖ అధికారులకు పరస్పరం ఫిర్యాదులు చేయడం హాట్​ టాపిక్​గా మారింది. మొదట ట్రస్మా నాయకులు విద్యార్థి సంఘాల ఆగడాలను ఆరికట్టాలని కోరుతూ రామగుండం పోలీస్​ కమిషనర్​కు కంప్లైంట్​ చేశారు. ట్రస్మా ఆరోపణలను ఖండిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రైవేట్​ విద్యాసంస్థల అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను బయటపెడుతామని హెచ్చరించారు. ఆ తర్వాత ట్రస్మా నాయకులు ఏసీపీకి, డీఈవోకు కంప్లైంట్​ చేయగా, విద్యార్థి సంఘాలు కూడా దీటుగానే స్పందించాయి. 

ట్రస్మా ఆరోపణలు ఇవీ... 

జిల్లాలో నకిలీ సంఘాలు, కుల సంఘాల పేరుతో పుట్టుకొస్తున్న స్టూడెంట్​ యూనియన్ల లీడర్లు ప్రైవేట్​ విద్యాసంస్థల యాజమాన్యాలను బ్లాక్​మెయిల్​ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, విద్యాబోధన సరిగా జరగనివ్వడం లేదని ట్రస్మా నాయకులు ఆరోపిస్తున్నారు. వారు చెప్పిన వాళ్లకు స్కూల్​ ఫీజుల్లో డిస్కౌంట్లు​, ఫ్రీ సీట్లు ఇవ్వాలని డిమాండ్​ చేయడంతో పాటు విద్యాసంస్థల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వేధిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు అమ్ముడు పోయి బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లపై దుష్ప్రచారం చేస్తున్నారని, నకిలీ విద్యార్థి సంఘాల నాయకులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి చీడపురుగుల్లా తయారయ్యారని తీవ్రమైన ఆరోపణలు చేయడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. 

అక్రమాలను ప్రశ్నించినందుకే...   

ట్రస్మా ఆరోపణలను విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలోని లోపాలను బయటపెడుతున్నందుకే విద్యార్థి సంఘాలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ఎవరూ భయపడరని స్పష్టం చేస్తున్నారు. చాలా స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయని, సరైన బిల్డింగులు, ఫైర్​సేఫ్టీ, గ్రౌండ్ లేవని, అర్హత కలిగిన టీచర్లు లేరని వాదిస్తున్నారు. స్కూళ్లలోనే బుక్స్​, స్టేషనరీ, యూనిఫామ్స్​ అమ్మడాన్ని తప్పుపడుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ స్కూల్​లో 25 శాతం సీట్లను పేదల పిల్లలకు కేటాయించాల్సి ఉండగా ఫీజులో డిస్కౌంట్లు కోరడం తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. టీచర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని, ఇష్టారీతిన ఫీజులు పెంచుతున్నారని, కరోనా సమయంలో సగం ఫీజులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ స్కూళ్లలో వంద శాతం వసూలు చేశారని పేర్కొంటున్నారు. విద్యాసంస్థలకు వచ్చే ఆదాయంలో ఐదు శాతం మాత్రమే యాజమాన్యాలు తీసుకొని మిగిలిన మొత్తాన్ని పాఠశాల అభివృద్ధికి కేటాయించాలనే నిబంధనలను ఎంతమంది పాటిస్తున్నారని నిలదీస్తున్నారు. స్కూల్​ పర్మిషన్​ ఒక దగ్గర ఉంటే మరో చోట నిర్వహిస్తున్నారని, బెస్ట్​ అవైలబుల్​ స్కూళ్లలోని స్టూడెంట్ల దగ్గర పైసలు వసూలు చేస్తున్నారని, పేదలు సమయానికి ఫీజు కట్టకుంటే పరీక్షలు పెట్టకుండా వేధిస్తున్నారని పేర్కొంటున్నారు. పోరాటాలను జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘనపై తాము సైతం ప్రభుత్వానికి కంప్లైంట్​ చేస్తామంటున్నారు.