
- గురువారం సాయంత్రానికి 17 వేల మెగావాట్లుగా నమోదు
- నిరుటి కన్నా ఈసారి 3,605 మెగావాట్లు ఎక్కువగా రికార్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పతాక స్థాయికి చేరుకుంది. గురువారం సాయంత్రం 4:39 గంటలకు 17,162 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది ఇదే రోజున 13,557 మెగావాట్ల డిమాండ్ రికార్డయింది. నిరుడు మార్చి 8న అత్యధిక విద్యుత్ డిమాండు 15,623 మెగావాట్ లుగా నమోదైంది. నిరుడు కన్నా ఈసారి 1,539 మెగావాట్లు అధికంగా డిమాండ్ వచ్చింది.
ఈనెల 18న 16,976 మెగావాట్ల డిమాండ్ రాగా గురువారం గరిష్ట పీక్ డిమాండ్ నమోదు అయింది. రాష్ట్రంలో మార్చి నెల నుంచి ప్రతిరోజు విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లకు మించి నమోదవుతున్నది. సర్కారు అనుకున్నట్లే ఈసారి అత్యధిక డిమాండ్ 17 వేల మెగావాట్లు దాటింది.
అయినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంట్ సరఫరా జరుగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కూడా రికార్డు స్థాయిలో డిమాండ్లు నమోదవుతున్నాయి. గురువారం 11,017 మెగావాట్ల డిమాండ్ రికార్డయింది. నిరుడు సెప్టెంబరు 20న అత్యధికంగా 9,910 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈసారి 1107 మెగావాట్లు ఎక్కువగా నమోదైంది.