రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలి...కేఆర్ఎంబీ మీటింగ్​లో తెలంగాణ డిమాండ్

రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలి...కేఆర్ఎంబీ మీటింగ్​లో తెలంగాణ డిమాండ్
  • మీటింగ్​కు ఎజెండా సిద్ధం చేసిన అధికారులు 
  • సాగర్ కాల్వల నిర్వహణ బాధ్యతలకూ డిమాండ్ 
  • ఏపీ విజ్ఞప్తితో మీటింగ్ వచ్చే నెల 3కు వాయిదా 

హైదరాబాద్, వెలుగు : ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ఆపివేయించాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)ను తెలంగాణ డిమాండ్ చేయనుంది. త్వరలో జరగబోయే కేఆర్ఎంబీ19వ బోర్డు మీటింగ్​లో ఈ మేరకు చర్చించే అంశాలపై ఎజెండాను అధికారులు సిద్ధం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును ఏపీ వేగంగా నిర్మిస్తున్నది. డీపీఆర్​కు మించి పనులను చేపట్టడంతో బోర్డు మీటింగ్​లో ఈ విషయంపై ఏపీ వైఖరిని ఎండగట్టాలని అధికారులు నిర్ణయించారు.

అంతేగాకుండా ఏపీ అనధికారికంగా చేపడుతున్న శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులపైనా చర్చించాలని ఎజెండాలో చేర్చారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఔట్​సైడ్ బేసిన్​కు నీటి తరలింపును అడ్డుకోవాలని కోరనున్నారు. వాటితో పాటు కృష్ణా బేసిన్​లో ఏపీ చేపడుతున్న అనధికార ప్రాజెక్టులనూ అధికారులు లేవనెత్తనున్నారు. ఏపీ చేపడుతున్న రాజోలిబండ డైవర్షన్​ స్కీమ్ రైట్ కెనాల్ నిర్మాణాన్ని ఆపివేయించి.. ఆర్డీఎస్​ను ఆధునీకరించాలన్న డిమాండ్​నూ బోర్డు ముందు పెట్టనుంది.  

సాగర్ కాల్వల బాధ్యతలు తెలంగాణకే 

నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల నిర్వహణ బాధ్యతలను తెలంగాణకే అప్పగించాలని బోర్డు మీటింగ్​లో మన అధికారులు డిమాండ్​ చేయనున్నారు. ఏపీ జెన్​కో అధికారులు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి 4 టీఎంసీల నీటిని తరలించుకుపోవడంపై అభ్యంతరాలు తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే టెయిల్​పాండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలను తెలంగాణకు అప్పగించాలని కోరనున్నారు.

శ్రీశైలం రిజర్వాయర్, ప్రకాశం బ్యారేజీ, సుంకేశుల బ్యారేజీల వద్ద ఎంత నీటిని తరలించుకుపోతున్నారో లెక్కలు తీసేందుకు సెన్సర్ ఆధారిత రియల్ టైమ్ డేటా అక్విజిషన్ సిస్టమ్(టెలిమెట్రీ)ని ఏర్పాటును కూడా బోర్డు దృష్టికి తీసుకురానున్నారు. ఓ వాటర్ ఇయర్​లో మిగిలిపోయిన నీటిని తదుపరి ఏడాది వాడుకునేలా క్యారీ ఓవర్​చేయడంపైనా చర్చించనున్నారు. డ్యామేజ్ అయిన శ్రీశైలం డ్యామ్ సర్జ్ పూల్ కు ఏపీ రిపేర్లు చేయించాలనీ డిమాండ్​చేయనున్నారు. కాగా, వాటితో పాటు బోర్డును ఏపీకి తరలించడం, బోర్డులో ఖాళీల భర్తీ, బోర్డు పరిధి, టెలిమెట్రీ ఫేజ్2 అమలు తదితర అంశాలపైనా మీటింగ్​లో చర్చించనున్నారు.

బోర్డు మీటింగ్ వాయిదా 

కేఆర్ఎంబీ మీటింగ్ వాయిదా పడింది. తొలుత ఈ నెల 21న (గురువారం) మీటింగ్ నిర్వహిస్తామంటూ ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖ పంపింది. అయితే, ఆ రోజు మీటింగ్ వద్దని ఏపీ చెప్పడం.. మీటింగ్ ఎజెండానూ ఇంకా ఇవ్వకపోవడంతో మీటింగ్​ను బోర్డు వాయిదా వేసింది. వచ్చే నెల 3న మీటింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది.