కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఫేక్ వీడియోలపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఫేక్ వీడియోలపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. AI సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి ప్రచారం చేశారని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌ తయారు చేశారని కోర్టు దృష్టికి గురుస్వామి తీసుకెళ్లారు.

భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో ప్రభుత్వం ప్రస్తావించింది. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్‌ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది. 

Also Read:-HCU విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు..

బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి చెందిన ఐటీ సెల్‌‌ ఇన్‌‌చార్జులపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూములపై ఫేక్‌‌ వీడియోలు సృష్టించి, సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారని బాగన్నగారి అరుణ్‌‌కుమార్‌‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసత్య ప్రచారంతో హెచ్‌‌సీయూ స్టూడెంట్లను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌‌ ఐటీ సెల్‌‌ ఇన్‌‌చార్జులు కొణతం దిలీప్‌‌, క్రిశాంక్‌‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.