
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, వెలుగు : భూభారతి చట్టాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్షుణ్నంగా, సమగ్రంగా పరిశీలించి చిన్న, చిన్న పొరపాట్లకూ తావులేకుండా భూభారతి విధి విధానాలను తయారు చేయాలని అధికారులకు సూచించారు. భూభారతి విధి, విధానాలను రూపొందించడంపై ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో రెండో రోజైన బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదని రైతుల ఉపాధి, జీవితానికే పునాది అని తెలిపారు. తెలంగాణలో భూమికి సంబంధించి అనేక సమస్యలున్నాయని, గత ప్రభుత్వ నిర్వాకంతో వాటికి సరైన పరిష్కారం దొరకలేదని విమర్శించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, భూ చట్టాల నిపుణుడు సునీల్, సీసీఎల్ఏ పీడీ, సీఎంఆర్వో మకరంద్, సీసీఎల్ఏ సహాయ కార్యదర్శి లచ్చిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
కేసీఆర్ వి పగటికలలు
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫామ్‌హౌస్ దాటని కేసీఆర్ అధికారంలోకి వస్తామంటూ పగటికలలు కంటున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోగానే తనకు పదేండ్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్ కు 14 నెలలుగా కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి ఎలా కనబడుతుందన్నారు.
కేసీఆర్ సీజనల్ పొలిటీషియన్ అని, ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారన్నారు. 14 నెలల నుంచి ఫాంహౌస్ దాటని ఆయన.. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ భవిష్యత్ గురించి కాకుండా ముందుగా కేసీఆర్ తన భవిష్యత్, తన పార్టీ భవిష్యత్ గురించి ఆలోచిస్తే బాగుంటుందన్నారు.