ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం: కాకినాడ పోర్టులో ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం: కాకినాడ పోర్టులో ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

అమరావతి: తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్ తో‎ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అగ్రిమెంట్లో భాగంగా 12 వేల 500 టన్నుల బియ్యాన్ని ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి ఓ భారీ నౌక ద్వారా పంపించటానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

ఈ క్రమంలోనే.. 2025, మార్చి 31వ తేదీన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టుకు వెళ్లి.. ఫిలిప్పిన్స్ దేశానికి తెలంగాణ బియ్యంతో వెళుతున్న నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బియ్యం ఎగుమతుల తీరును ఆయన పరిశీలించారు. తెలంగాణలో పోర్టులు లేకపోకపోవడంతో పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి ఫిలిప్పీన్స్‎కు బియ్యం ఎగుమతి చేస్తోంది తెలంగాణ సర్కార్. 

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిలిప్పీన్స్‎కి 8 లక్షల టన్నులు బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఒప్పందంలో భాగంగా తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నామని చెప్పారు. ఇతర దేశాలకు కూడా బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని.. ఇందులో తెలంగాణ రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. స్వయంగా నేనే వెళ్లి రైస్ ఎగుమతులపై ఇతర దేశాలతో చర్చిస్తానని తెలిపారు.