ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం.. కాకినాడ పోర్ట్​ వద్ద జెండా ఊపి షిప్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్​

ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం.. కాకినాడ పోర్ట్​ వద్ద జెండా ఊపి షిప్ను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్​
  • తొలి విడత 12,500 టన్నుల రైస్​ సరఫరా
  • రాష్ట్రం నుంచి ఏడాదికి 8 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి
  • వరల్డ్​ రైస్​ మార్కెట్​లో ఇదో కీలక ముందడుగు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్​, వెలుగు: ఫిలిప్పీన్స్​కు తెలంగాణ బియ్యం సరఫరా ప్రారంభం అయింది. తెలంగాణకు చెందిన బియ్యాన్ని ముందుగా కాకినాడ పోర్ట్​కు తరలించి, అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌‌కు రవాణా చేస్తున్నారు. తొలివిడత 12,500 టన్నుల బియ్యంతో బయలుదేరిన  ‘ట్రంగ్ ఎన్’  షిప్​ను సోమవారం కాకినాడ పోర్ట్​లో తెలంగాణ సివిల్​ సప్లయ్స్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి  జెండా ఊపి ప్రారంభించారు. దీంతో వరల్డ్​ రైస్​ మార్కెట్‌‌లోకి తెలంగాణ అధికారికంగా 
ప్రవేశించినట్లయింది. 

మిగులు ధాన్యంపై సర్కారు ఫోకస్ 

రాష్ట్రంలో వార్షిక వరి ధాన్యం ఉత్పత్తి దాదాపు  280 లక్షల టన్నులు ఉంటున్నది. తెలంగాణ స్టేట్ పూల్, సెంట్రల్​ పూల్‌‌కు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ బియ్యం ఉత్పత్తి అవుతున్నది.  ఒక దశలో టెండర్ల ద్వారా ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో మిగులు ధాన్యాన్ని మిల్లింగ్​ చేయించి, బియ్యాన్ని  ఎక్స్​పోర్ట్ చేసే అవకాశాలను రాష్ట్ర సర్కారు అన్వేషించింది. 

ఈ క్రమంలోనే   ఫిలిప్పీన్స్‌‌కు ఎగుమతికి  ఉన్న అవకాశాన్ని పరిశీలించింది. ఇటీవల ఆ దేశ ప్రభుత్వ  ప్రతినిధులతో సివిల్​ సప్లయ్స్​ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. బియ్యం నాణ్యతను పరిశీలించిన తర్వాత ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మొదట తెలంగాణ నుంచి  లక్ష టన్నుల బియ్యాన్ని ఇంపోర్ట్​ చేసుకునేందుకు  అంగీకారం తెలిపింది. అనంతరం ఏటా  8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఫిలిప్పీన్స్‌‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.  సివిల్​ సప్లయ్స్​ కార్పొరేషన్​, ప్లాంటర్స్​ ప్రొడక్ట్స్​ మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. 

రాష్ట్ర రైతాంగానికి శుభ పరిణామం: ఉత్తమ్​

ఫిలిప్పీన్స్‌‌కు తెలంగాణ రైస్​ను విజయవంతంగా ఎగుమతి చేశామని, వరల్డ్​ రైస్​ మార్కెట్‌‌లో ఇదో కీలక ముందడుగు అని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. కాకినాడ పోర్ట్​లో షిప్​ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతులకు, వ్యవసాయ రంగానికి ఇది శుభపరిణామం అని పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ బియ్యం కీలక పాత్ర పోషించబోతున్నదని తెలిపారు.  అనుకూలమైన నేలలు, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ సహకారంతో వరి పండించే ప్రధాన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో వరి సాగులో ప్రతి ఏటా గణనీయమైన వృద్ధి సాధిస్తున్నదని, ఇక్కడి అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నదని తెలిపారు.  

ప్రభుత్వం ధాన్యం సేకరించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్​సీఐ కి  సీఎంఆర్​ రూపంలో అందిస్తుందని,  సీఎంఆర్​ జాప్యంతో వడ్డీల భారం పెరిగి సివిల్​ సప్లయ్స్​ పై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో మిగులు ధాన్యం ఎక్స్​పోర్ట్​ అవకాశాలను అన్వేషించామని తెలిపారు.  ఫిలిప్పీన్స్‌‌ దేశ అవసరాలకు  అనుగుణంగా తెలంగాణ బియ్యం ఎగుమతికి అవకాశాలను కనుగొన్నామని, ఆ దేశ ప్రతినిధులతో చర్చలు జరిపడంతో 8 లక్షల టన్నుల బియ్యాన్ని  దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి వ్యక్తం చేసిందని తెలిపారు. 

ఒప్పందంలో భాగంగా సోమవారం తొలి విడతగా 12, 500 టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నామని చెప్పారు. ఇతర దేశాలకు బియ్యాన్ని ఎక్స్​పోర్ట్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని రాష్ట్ర అవసరాలు పోను మిగిలినవి ఎక్స్​పోర్ట్​ చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు చేయలేదని, తానే స్వయంగా వెళ్లి రైస్​ ఎక్స్​పోర్ట్​ పై ఇతర దేశాలతో చర్చిస్తానని చెప్పారు.ఈ ఎక్స్​పోర్ట్స్​ లో తమవంతు పాత్ర పోషించిన రైతులు, రైస్ మిల్లర్లు, సివిల్​ సప్లయ్స్​ కార్పొరేషన్ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. రైతు ఆదాయాన్ని మెరుగుపరచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతునిస్తుందని మంత్రి ఉత్తమ్​ వివరించారు.

5 శాతం నూకతో బియ్యం సరఫరా

ఫిలిప్పీన్స్​ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం  రైస్​ క్వాలిటీని పరిశీలించి, నిర్ధారించింది. ధాన్యానికి టెస్ట్‌‌ మిల్లింగ్‌‌ నిర్వహించి.. ఎక్స్​పోర్ట్​ క్వాలిటీకి  ఉండాల్సిన ప్రమాణాలను పరిశీలించి, ఓకే చేసింది.  ఇప్పటి వరకు ప్రభుత్వం సీఎంఆర్ కు  25 శాతం నూకతో ఎఫ్​సీఐకి అప్పగించే పరిస్థితి ఉండేది.  ఫిలిప్పీన్స్​తో కుదిరిన ఒప్పందంలో 5 శాతం నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది.  ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి  చేసేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని 103 మంది మిల్లర్ల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. 

గత యాసంగిలో నల్గొండ, యాద్రాద్రి, సూర్యాపేట, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల్లో పండిచిన 1010, ఐఆర్​64 వరి ధాన్యం వెరైటీలు క్వాలిటీగా ఉన్నట్టు  అధికారులు గుర్తించారు. తెలంగాణలో పోర్ట్​లు లేక పోవడంతో ఏపీలోని కాకినాడ పోర్ట్​ నుంచి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. సివిల్​ సప్లయ్స్​ అధికారులు   తొలి విడతలో భాగంగా గత యాసంగి సీజన్ కు సంబంధించిన ధాన్యాన్ని  కస్టమ్​ మిల్లింగ్​ రైస్​ (సీఎంఆర్) చేసి.. 12,500  టన్నుల బియ్యాన్ని ఫిలిప్సీన్స్ కు ఎక్స్​పోర్ట్​ చేశారు.   మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి స్వయంగా కాకినాడ పోర్ట్​కు వెళ్లి జాతీయ జెండా ఊపి ఎక్స్​పోర్ట్​ ప్రారంభించి.. పనితీరును పర్యవేక్షించారు.