పంచాయతీ కార్మికుల జీతాలకు నిధులు విడుదల

  •     రూ.150.57 కోట్లు రిలీజ్​ చేస్తూ పీఆర్ కమిషనర్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్​లో ఉన్న జీతాలను విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఈ మేరకు రూ.150 కోట్ల 57లక్షల 59వేల 500లు విడుదల చేశారు. రాష్ట్రంలో 29,676 మంది మల్టీ పర్పస్  గ్రామ పంచాయతీ కార్మికులు ఉండగా.. వారికి గత 6 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని చోట్ల 8, 10 నెలల నుంచీ పెండింగ్ లో ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. 

అయితే, వీరి జీతాలను గ్రామ పంచాయతీలే చెల్లించాల్సి ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్​ రాకపోవడం, గ్రామ పంచాయతీల్లో ఫండ్స్ లేకపోవడంతో జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇచ్చే స్టేట్ ఫైనాన్స్ నిధుల్లో భాగంగా ఈ ఫండ్స్ రిలీజ్ చేసినట్టు ఉత్తర్వుల్లో కమిషనర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఈ నిధులు రిలీజ్ చేయాలని డీపీవోలను కమిషనర్  ఆదేశించారు. కాగా, ఈ నిధులను కార్మికుల జీతాలకే ఖర్చు చేయాలని, మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల కోసం ఉపయోగించొద్దని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్, వెంకటయ్య కోరారు. పెండింగ్​జీతాలు విడుదల చేయడం;[ సీఎం రేవంత్ రెడ్డికి, పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కకు వారు ధన్యవాదాలు తెలిపారు.