ఫ్యాన్సీ నంబర్ల వేలం .. ఆర్టీఏకు ఒకేరోజు 43 లక్షల ఇన్​కం

ఫ్యాన్సీ నంబర్ల వేలం .. ఆర్టీఏకు ఒకేరోజు 43 లక్షల ఇన్​కం
  • అత్యధికంగా 9999 నంబర్​కు రూ.25 లక్షలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీఏకు ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. టీజీ రిజిస్ట్రేషన్ ​ప్రారంభమైనప్పటి నుంచి ఫ్యాన్సీ నంబర్లకు పెద్దఎత్తున స్పందన వస్తున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే ఖైరతాబాద్​ సెంట్రల్​ జోన్​ పరిధిలో రూ.43.70 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. వేలంలో సోనీ ట్రాన్స్​పోర్ట్​ సొల్యూషన్స్.. ​టీజీ 09 9999 నంబర్​ను రూ.25,50,002 లకు దక్కించుకుంది. అలాగే టీజీ 09ఎ 0006 నంబర్​ను రామకృష్ణ ఎర్రమనేని అనే వ్యక్తి రూ.2,76,000లకు దక్కించుకున్నారు. 

టీజీ09 ఎ 0005 నంబర్​ను యారో అడ్వర్టయిజింగ్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ​సంస్థ రూ.1,80,200 పెట్టి దక్కించుకుంది. టీజీ09 ఎ 0019 నంబర్​ను యలమంచిలి గోపాల కృష్ణ 1,20,019 రూపాయలకు దక్కించుకున్నారు. టీజీ 09 ఎ 0009 నంబర్​ను ఎస్కే కార్​లాంజ్​ సంస్థ రూ.1,10,009కి దక్కించుకుంది. 9999 నంబర్​కు రూ.25 లక్షలు పలకడం రాష్ట్రంలోనే రికార్డు అని ట్రాన్స్ పోర్ట్ జాయింట్​ కమిషనర్​ రమేశ్​ కుమార్ మీడియాకు తెలిపారు.