నిరుడు ఏకంగా రూ.1,350 కోట్ల లోన్లు తీసుకున్న ఆర్టీసీ

నిరుడు ఏకంగా రూ.1,350 కోట్ల లోన్లు తీసుకున్న ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీ అప్పు రోజురోజుకు పెరిగిపోతోంది. అధికారులు లోన్ల మీద లోన్ల తెస్తున్నారు. ఒక్క పోయినేడాదిలోనే ఏకంగా రూ.1,350 కోట్ల రుణాలు తీసుకున్నారు. జులైలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.500 కోట్లు, సెప్టెంబర్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.500 కోట్లు, డిసెంబర్ లో కెనరా బ్యాంక్ నుంచి రూ.350 కోట్ల లోన్ తీసుకున్నారు. రుణం కోసం కెనరా బ్యాంక్ దగ్గర రాణిగంజ్1, రాణిగంజ్2 డిపోలను కుదవపెట్టారు. అంతేకాకుండా ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద మేడ్చల్ డిపోను సెక్యూరిటీగా పెట్టారు. మొత్తంగా ఆర్టీసీ అప్పులు 3,200 కోట్లకు చేరాయి. వీటిలో కమర్షియల్ బ్యాంకుల నుంచి రూ.2,639 కోట్లు, ఎస్ఆర్ బీఎస్ నుంచి రూ.363 కోట్లు, ఎస్ బీటీ నుంచి రూ.128 కోట్లు, ఫైనాన్స్ ఇన్ స్టిట్యూషన్ల నుంచి రూ.20 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్లు రూ.62 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా పీఎఫ్ కు ఎంప్లాయర్ షేర్ కింద రూ.746 కోట్లు, ఎంప్లాయ్ షేర్ కింద రూ.487 కోట్లు, సీసీఎస్ కు రూ.593 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

ఉద్యోగులకు పైసా ఇస్తలే... 

ఇంత పెద్ద మొత్తంలో లోన్లు తెచ్చినప్పటికీ, తమకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. పోయినేడాది రూ.1,350 కోట్ల లోన్లు తెస్తే, అందులో ఒక్క రూపాయన్నా తమకు కేటాయించలేదని ఫైర్ అవుతున్నారు. అసలు రుణాల డబ్బులన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. లోన్ల విషయంలో అధికారులు సీక్రెట్ మెయింటెయిన్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆర్టీసీలో 48 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ వచ్చాక 2015లో ఆర్టీసీ కార్మికులకు 44 శాతం జీతాలు పెంచారు. పెరిగిన జీతాలు 2013 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అప్పుడు ఆర్టీసీ దగ్గర డబ్బులు లేకపోవడంతో 2013 ఏప్రిల్ నుంచి 2015 మే వరకు పెరిగిన జీతాల బకాయిలను బాండ్ల రూపంలో ఇచ్చారు. 8.5 శాతం వడ్డీతో ఐదేండ్ల తర్వాత చెల్లించేలా ఈ బాండ్లను జారీ చేశారు. ఐదేండ్లు దాటినా ఇప్పటికీ పైసా చెల్లించలేదు. ఒక్కో ఉద్యోగికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉంది. ఇవి కాకుండా 2017, 2021కి చెందిన రెండు పీఆర్సీలు, ఆరు డీఏలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. మరో వైపు 8 లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు చెల్లించాల్సి ఉంది. 

డబ్బులన్నీ ఏం చేస్తున్రు? 

ఆర్టీసీ అధికారులు అప్పు తెచ్చిన డబ్బులను ఏం చేస్తున్నారో బయటకు చెప్పడం లేదు. తీసుకున్న డబ్బుల్లో కనీసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా ఉద్యోగుల సమస్యలు తీరేవి. ఇప్పటికే ఆరు డీఏలు, రెండు పీఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి. మేనేజ్ మెంట్ స్పందించి త్వరగా చెల్లించాలి.  
- నాగేశ్వరరావు, ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ లీడర్