
- కోర్టు ఆదేశాలతో రూ.300 కోట్లు చెల్లించిన సర్కారు
- నిధుల కొరతతో కొన్నేళ్లుగా ఉద్యోగులకు చెల్లింపులు బంద్
- రూ.1200 కోట్లకు చేరిన బకాయిలు
హైదరాబాద్,వెలుగు : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంస్థ (సీసీఎస్) గాడిన పడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి, ఇతర వ్యయాల కోసం సీసీఎస్ నిధులను వినియోగించింది. ఆర్టీసీ తిరిగి సంస్థకు నిధులు చెల్లించకపోవడంతో సీసీఎస్ కష్టాల్లో పడింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలు, సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఇంటి రుణాలు, విద్యా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లోకి జారుకుంది. దీంతో అనేక పర్యాయాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్తూ వచ్చినా అది కూడా జరగకపోవడంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక పక్క సీసీఎస్ లో నిధులు లేక, మరోపక్క ప్రభుత్వంలో విలీనం కాకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎస్‌కు బకాయి పడిన నిధులను ఆర్టీసీ చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం రూ.300 కోట్లు చెల్లించింది.
ఒక్కో కార్మికుడికి రూ.5 లక్షల లోన్!
సీసీఎస్ రూ.1200 కోట్ల బకాయిలకు గాను రూ.150 కోట్లు, బ్యాంకుల గ్యారంటీతో మరో రూ.150 కోట్లు కలిపి మొత్తం రూ.300 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన మొత్తాలను కూడా కొంత వరకు చెల్లించే అవకాశం కలిగింది. అయితే, సీసీఎస్ లో దాదాపు 48 వేల మంది ఉద్యోగులు సభ్యులుగా ఉండగా కొంత కాలంగా సీసీఎస్ సభ్యత్వాన్ని రద్దుచేసుకున్న వారు దాదాపు 15 వేల వరకు ఉంటారని అంచనా. ఉద్యోగుల జీతం నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని సీసీఎస్‌లో జమచేయాల్సి ఉంటుంది.
ఇలా జమచేసిన మొత్తాన్ని ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత పొదుపు చేసిన మొత్తంలో వడ్డీతో కలిపి చెల్లిస్తారు. కానీ, గత నాలుగైదేండ్లుగా రిటైర్ అయిన వారికి చెల్లింపులు చేయడం లేదు. ఇక సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సైతం ఇంటి నిర్మాణం, విద్య, వివాహాలు తదితర అవసరాల కోసం సీసీఎస్ రుణాలు ఇస్తుంది. ఇది కూడా కొంతకాలంగా నిలిచిపోయింది. ప్రస్తుతం సంస్థకు వచ్చిన 300 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి చివరి వరకు ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేస్తున్నారు. అలాగే గత నెల 24 నుంచి కార్మికులకు కొత్తగా రుణాలను కూడా సీసీఎస్ ఇస్తోంది. తాజాగా వచ్చిన నిధులతో సగటున ఒక్కో కార్మికుడికి రూ.5 లక్షల లోన్ ఇచ్చే వెసులుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు.