
- లేబర్ కమిషనర్‌కు 21 డిమాండ్లతో లేఖ అందజేత
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే నెల 7 నుంచి సమ్మె ప్రారంభిస్తామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పష్టం చేశారు. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులంతా ర్యాలీగా లేబర్ కమిషనర్ ఆఫీసుకు చేరుకుని కమిషనర్ కు 21 డిమాండ్లతో కూడిన లేఖను అందించారు. అనంతరం ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. జనవరి 27న సమ్మె నోటీసిచ్చినా ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
లేబర్ శాఖ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2017 వేతన సవరణకు సంబంధించిన అలవెన్స్ లు ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు. 2021 వేతన సవరణ కాల పరిమితి అయిపోయినందున వెంటనే వేతన సవరణ చేసి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వీటన్నింటిపై ప్రభుత్వం తమను వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మె చేయక తప్పదని ఈదురు వెంకన్న హెచ్చరించారు.