జనవరి 27న ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ​ఇస్తం

జనవరి  27న ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ​ఇస్తం

 

  • తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నామని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. బుధవారం వీఎస్టీలోని జేఏసీ ఆఫీసులో సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చలేదన్నారు. 

ఉద్యోగుల విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేత, 2021 నుంచి వేతన సవరణ, ప్రభుత్వం ద్వారా ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. రోజుకో డిపో చొప్పున ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో కార్పొరేట్ సంస్థలైన జేబీఎంకు ధారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మెబాట పట్టాల్సి వస్తోందని తెలిపారు. జనవరి 27న ప్రభుత్వం, యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, మౌలానా, కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, యాదగిరి,పాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.