
- బెంగళూరు, విజయవాడ రూట్లో పది శాతం సబ్సిడీ
- ఇతర రాష్ట్రాల బస్సు చార్జీలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ
హైదరాబాద్, వెలుగు: తగ్గిపోతున్న ఆదాయాన్ని పెంచుకోవడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే దూర ప్రాంతాలకు ఏసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు అధికారులు రాయితీ ప్రకటించారు. వారిని ఇతర రాష్ట్రాల బస్సుల్లో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వెళ్లకుండా మన రాష్ట్ర ఆర్టీసీనే ఆదరించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, నెల్లూరు, విజయవాడ, వైజాగ్, చెన్నై, కడప వంటి ప్రాంతాలకు ఆర్టీసీ ఏసీ బస్సులను నడుపుతోంది.
అయితే శని, ఆదివారాల్లో తప్ప మిగితా రోజుల్లో ఆయా రూట్ లలో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. బెంగళూరు వెళ్లే వారికి కర్నాటక ఆర్టీసీ చార్జీలతో పోలిస్తే.. తెలంగాణ ఆర్టీసీ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ, తమిళనాడు ఆర్టీసీ చార్జీలతో పోల్చినా... తెలంగాణ ఆర్టీసీ చార్జీలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఆయా రూట్లలో ఆ నగరాలకు వెళ్లే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అలాగే, ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీలు కూడా తెలంగాణ ఆర్టీసీ చార్జీలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. అందుకే ప్రయాణికులు మన రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీన్ని గుర్తించిన అధికారులు.. పది శాతం రాయితీలు ఇస్తూ ప్రయాణికులను తమ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మొన్న బెంగళూరు రూట్ లో నడిచే బస్సుల్లో పది శాతం రాయితీ ప్రకటించగా, తాజాగా విజయవాడ రూట్ లో వెళ్లే బస్సుల్లోనూ పది శాతం సబ్సిడీ ప్రకటించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీలు ఇంచుమించు ఇతర రాష్ట్రాల బస్సు చార్జీలతో సమానం అయ్యాయి.