
- వాస్తవానికి 3 జిల్లాల్లోనే అధిక సంపద..అదీ కొద్ది మంది బిలియనీర్ల దగ్గర్నే
- దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏండ్లుగా పాలకుల ప్రచారం
- 2023–24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరి ఇన్కమ్ రూ.3.56 లక్షలు
- ఆ ఇసాబ్లో నలుగురున్న ఫ్యామిలీ ఆమ్దానీ
- రూ. 14 లక్షలకుపైనే ఉండాలి.. కానీ, ఆ సంపదంతా ఉన్నది కొద్ది మంది పెద్దల చేతుల్లోనే..!
- హైదరాబాద్‌లో వెయ్యి మంది దగ్గర రూ. 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు
- రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువ
- 24 జిల్లాల్లో రూ.2.50 లక్షల లోపే పర్ క్యాపిటా ఇన్కమ్!
- ఎనిమిది జిల్లాల్లోనైతే రూ.2లక్షల లోపే
హైదరాబాద్, వెలుగు: ‘‘తెలంగాణ తలసరి ఆదాయం ఏటా పెరుగుతున్నది. ఇప్పుడు అది రూ.3.56 లక్షలు.. రాష్ట్రం వెలిగిపోతున్నది.. ప్రజల ఆదాయం పెరిగి, పేదరికం తగ్గుతున్నది’’.. ఇవీ కొన్నేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న మాటలు, లెక్కలు!! వాటి ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో ఒక్కొక్కరి ఇన్‌కం రూ.3.56 లక్షలు. ఉదాహరణకు మీ ఇంట్లో నలుగురుంటే మీ ఏడాది ఆదాయం రూ.14 లక్షలకు పైనే ఉండాలి. అంటే నెలకు దాదాపు రూ.1.20 లక్షలన్నమాట! ఈ లెక్కన మన రాష్ట్రంలో పేదరికం ఒక్క దెబ్బకే ఎగిరిపోవాలి. కానీ, సీన్ వేరేలా ఉంది.
రాష్ట్రంలో సంపద మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో, అందులోనూ కొంతమంది బిలియనీర్ల చేతుల్లోనే ఉంది. ఈ మూడు జిల్లాల్లోని లెక్కలు, ఇతర జిల్లాల లెక్కలు అన్నీ కలుపుకొని యావరేజ్ తీస్తే రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా కనిపిస్తున్నది. ఈ ఓవరాల్ లెక్కలను చూపెట్టి.. రాష్ట్రమంతా వెలిగిపోతున్నదని, మన ప్రజల ఆదాయం మస్తు పెరుగుతున్నదని లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. తలసరి ఆదాయం గొప్పగా కనిపిస్తున్నా.. రాష్ట్రంలోని పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. 2023–-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలనే చూస్తే.. తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని సుమారు 24 జిల్లాలు రూ.2.50 లక్షలకే పరిమితమయ్యాయి.
ఎనిమిది జిల్లాలైతే రూ. 2లక్షల లోపల్నే ఉన్నాయి. అదే రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఏకంగా రూ. 9 లక్షల 54 వేల 949 ఉంది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ రూ. 4 లక్షల 97వేల 854, సంగారెడ్డి జిల్లా రూ. 3 లక్షల 21వేల 799గా ఉంది. ఈ మూడు జిల్లాల్లో అదీ కొద్ది మంది దగ్గరే వేల కోట్ల సంపద ఉంది.
పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్
2023–-24 ప్రాథమిక అంచనాల ప్రకారం.. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలిచింది. తెలంగాణ కంటే ముందు సిక్కిం, ఢిల్లీ, గోవా ఉన్నా ఇవి చిన్న రాష్ట్రాలు కావడంతో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణదే మొదటి స్థానం. తెలంగాణ తలసరి ఆదాయం 3,56,564. ఇది జాతీయ తలసరి ఆదాయం (రూ.1,84,205) కంటే రూ.1,72,359 ఎక్కువగా ఉంది.
ఈ విషయంలో పొరుగున ఉన్న కర్నాటక(రూ. 3,32,926), తమిళనాడు(రూ. 3,15,220), కేరళ(రూ. 2,81,001), మహారాష్ట్ర(రూ. 2,77,603), ఏపీ (రూ. 2,42,479) మన వెనుకే ఉన్నాయి. కొన్నేండ్లుగా రాష్ట్రం లో రియల్ఎస్టేట్ దూకుడుకు ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో పెరుగుదల తోడై రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుతుండడం, ఆ మేరకు జనాభా రేషియో పెరగకపోవడంతో తలసరి ఆదాయం పెరుగుతున్నట్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
మూడు జిల్లాల్లో ఎక్కువ
2023–24లో తెలంగాణ జీఎస్డీపీ (గ్రాస్ స్టేట్డొమెస్టిక్ ప్రొడక్ట్) ఏకంగా 15.01లక్షల కోట్లకు చేరింది. ఈ జీఎస్డీపీలో అత్యధికంగా 60శాతానికిపైగా రియల్ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐటీ, ఫార్మా , ట్రేడ్, హోటల్స్ రంగం నుంచే వస్తున్నది. కాగా, ఈ రంగాలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనే విస్తరించి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఈ మూడు జిల్లాల ప్రజల తలసరి ఆదాయమే ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఫార్మా, వ్యాపార, వాణిజ్యాలకు కేంద్రంగా ఉన్న రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఏకంగా రూ. 9 లక్షల 54 వేల 949 ఉంది.
ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్(4,97,854), సంగారెడ్డి (3,21,799) ఉన్నాయి. ఈ జిల్లాల్లోనూ సంపదంతా కీలక రంగాలకు చెందిన కొంతమంది చేతుల్లోనే ఉంది. 2024లో హురున్ ఇండియా విడుదల చేసిన ‘ఇండియా రిచ్‌లిస్ట్’ జాబితాలో వ్యక్తిగత సంపద రూ.వెయ్యి కోట్లు దాటినవారిలో104 మంది హైదరాబాదీలే ఉన్నారు. ఇందులో మురళీ దివి (దివీ ఫార్మా) రూ. 76,100 కోట్లు, పిచ్చి రెడ్డి(మేఘా కన్స్ట్రక్షన్) రూ.54,800 కోట్లు, పీవీ కృష్ణారెడ్డి (మేఘా కన్స్ట్రక్షన్) రూ.52,700 కోట్లు, పార్థసారథి రెడ్డి (హెటిరో ఫార్మా) రూ. 29,900 కోట్ల సంపదతో ఉన్నారు.
ఇలా హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల పరిధిలో లక్షల కోట్ల సంపద కొద్ది మంది చేతుల్లో ఉండడం, అదంతా అనివార్యంగా రాష్ట్ర ఆదాయంలో కనిపిస్తుండడం వల్లే తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే ఎక్కువ కనిపిస్తున్నది. ఈ గణాంకాలను చూసే మన రాష్ట్రాన్ని కేంద్రం రిచ్స్టేట్గా పరిగణిస్తున్నదని, అందువల్లే మన రాష్ట్రానికి పలు కేటాయింపుల్లో కోతలు పెడ్తున్నదనే వాదనలూ ఉన్నాయి. కానీ అధిక తలసరి ఆదాయం చెప్పుకోవడానికే తప్ప పేదలకేమీ ఒరగడం లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జిల్లాలవారీగా చూసినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను మినహా ఇస్తే 24 జిల్లాల్లో రూ.2.50 లక్షల లోపు, 8 జిల్లాల్లో రూ. 2 లక్షల లోపే తలసరి ఆదాయం ఉందనే లెక్కలను గుర్తుచేస్తున్నారు.
కరోనా తర్వాత అనూహ్య పెరుగుదల
2014లో రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయంలో పెరుగుదల అంతంతే ఉంది. పైగా కరోనా టైంలో తగ్గింది. ఆ తర్వాత 2021–22 నుంచి రాష్ట్ర తలసరి ఆదాయం అమాంతం పెరుగుతూ పోతున్నది. 2014–15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104గా ఉండగా.. అప్పట్లో దేశ తలసరి ఆదాయం రూ.86,647. అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ దాదాపు రూ.40 వేలు ఎక్కువగా ఉన్నది.
ఆ తర్వాతి సంవత్సరం 2015–16లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.16 వేలు పెరిగి రూ.1.40 లక్షలకు చేరింది. అప్పుడు దేశ తలసరి ఆదాయం రూ. 94,797గా ఉన్నది. 2016–17లో రూ.1.59 లక్షలకు, 2017–18లో రూ.1.79 లక్షలకు, రూ.2018–19లో రూ.2.09 లక్షలకు, 2019–20 రూ.2.31 లక్షలకు, 2020–21లో రూ.2.25 లక్షలకు తలసరి ఆదాయం పెరిగింది. అప్పటిదాకా ఏటా రూ.20నుంచి 25 వేలు పెరుగుతూ వచ్చిన తలసరి ఆదాయం 2021–22లో ఒకేసారి 35 వేలు పెరిగి రూ.2.69 లక్షలకు చేరింది. ఆ తర్వాత 2022–23లో రూ.43 వేలు పెరిగి 3.12 లక్షలకు చేరింది. ఇక 2023–24లో మళ్లీ రూ.44 వేలు పెరిగి రూ.3.56 లక్షలకు చేరడం గమనార్హం.