సమ్మక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్

సమ్మక్క సారలమ్మ ట్రైబల్ వర్సిటీ వీసీగా లక్ష్మీ శ్రీనివాస్
  • కేంద్ర ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ 

ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన యూనివర్సిటీ వైస్ చాన్స్​లర్‌‌‌‌‌‌‌‌ (వీసీ)గా ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ యెడవెళ్లి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యా శాఖ డిప్యూటీ సెక్రటరీ శ్రేయ భరద్వాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జాతీయ గిరిజన యూనివర్సిటీ మెంటర్ అయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫెసర్ లక్ష్మీ శ్రీనివాస్ హైదరాబాద్‌‌‌‌లోని అరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీ ప్రొ-వీసీగా పని చేస్తున్నారు. ఆయన గిరిజన యూనివర్సిటీకి ఐదేండ్ల పాటు లేదా 70 ఏండ్లు వచ్చే వరకు వీసీగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్​కు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ జ్యుడీషియల్ అకాడమీ ఆఫ్ తెలంగాణాలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. న్యాయ అధికారులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌‌‌‌లో శిక్షణ ఇచ్చారు, హైదరాబాద్‌‌‌‌లోని డీఆర్‌‌‌‌డీవోలోని రీసెర్చ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో శాస్త్రవేత్తల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌‌‌‌లో 15 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. కాగా, ఎస్‌‌‌‌ఎస్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తరగతులు ములుగు మండలం జాకారం వైటీసీలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు.