- 10 మందికి తీవ్రగాయాలు
- కాలుకు కోసుకుపోవడంతో గాయపడ్డ మరో ఇద్దరు
యాదగిరిగుట్ట/కామారెడ్డిటౌన్/భిక్కనూరు/బాల్కొండ/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : చైనా మాంజా తగిలి దంపతులు గాయపడ్డారు. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో జరిగింది. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన నారాయణ, వీరమణి దంపతులు నారసింహుడిని దర్శించుకునేందుకు స్కూటీపై యాదగిరిగుట్టకు వచ్చారు. మున్సిపల్ ఆఫీస్ సమీపంలో మాంజా దారం తగలడంతో నారాయణ గొంతుకు గాయమైంది. ఈ టైంలో బైక్ సడన్ బ్రేక్ వేయడంతో వీరమణి బైక్ పైనుంచి కిందపడగా తలకు గాయమైంది.
వీరిని 108 వాహనంలో భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన జావేద్ మంగళవారం బైక్‌పై వెళ్తున్నాడు. రైల్వే బ్రిడ్జిపైకి రాగానే చైనా మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. గమనించిన స్థానికులు జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మ్యాదరి సిద్దరాములు బైక్‌పై వెళ్తుండగా సిద్ధరామేశ్వర కమాన్ వద్ద మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. తీవ్రగాయం కావడంతో ఎనిమిది కుట్లు పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన గజ్జెటి ప్రవీణ్ గొంతుకు మాంజా తగలడంతో గాయపడ్డాడు. స్థానికులు అర్మూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన భుక్యా నవీన్, సుప్రజ దంపతులు బైక్‌పై వెళ్తున్నారు. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో పతంగి మాంజా తగిలింది. దీంతో గొంతు కోసుకుపోవడంతో పాటు ఇద్దరూ కిందపడి గాయాలపాలయ్యారు. కొత్తగూడెం పట్టణంలో ఓ యువకుడి కాలుకు చైనా మాంజా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్ పరిధిలో ముగ్గురు
బషీర్‌బాగ్, వెలుగు : చైనా మాంజా తగిలి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గాయపడ్డాడు. లంగర్‌హౌస్‌లో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజ్ మంగళవారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై అంబర్‌పేటలోని ఇంటికి వెళ్తున్నాడు. నారాయణగూడ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే మాంజా మెడకు తగిలి కోసుకుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుషాయిగూడలోని నాగార్జునకాలనీకి చెందిన సాయివర్ధన్‌రెడ్డి ఉప్పల్ డీసీఎల్ బిల్డింగ్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం డ్యూటీకి వెళ్తుండగా ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది.
అలాగే వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని బొపునారం గ్రామానికి చెందిన ఐనెల్లి అనంతయ్య కొడుకు ధనుశ్ (7) మంగళవారం పతంగి ఎగరవేస్తున్నాడు. ఈ టైంలో చైనా మాంజా కాళ్లకు తగిలింది. దానిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుండగా రెండు కాళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుంచారం హాస్పిటల్‌కు తరలించగా, అక్కడి నుంచి తాండూర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
పతంగి ఎగరేస్తూ బిల్డింగ్‌పై నుంచి పడి ఇద్దరు, చూసేందుకు వెళ్లి ఒకరు మృతి
యాదగిరిగుట్ట/నిర్మల్/శంషాబాద్, వెలుగు : పతంగి ఎగురవేస్తూ బిల్డింగ్ పైనుంచి పడడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. యాదాద్రి జిల్లా మోటకొండూర్ మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన జూపల్లి నరేందర్ (48) కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తన అన్నకు చెందిన బిల్డింగ్ పైకి ఎక్కి పతంగి ఎగురవేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే నిర్మల్ పట్టణంలోని గుల్జార్ మార్కెట్ ఏరియాకు చెందిన ఎస్‌కే.ఉబేద్ (14) తన ఫ్రెండ్స్‌తో కలిసి పాత కూరగాయల మార్కెట్ సమీపంలోని ఓ బిల్డింగ్ ఎక్కి పతంగి ఎగురవేస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు బాలుడిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. విషయం తెలుసుకున్న నిర్మల్ అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ హాస్పిటల్‌కు వచ్చి ఉబేద్ డెడ్‌బాడీని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోని మార్కండేయ నగర్‌కు చెందిన మాధవరావు (55)కు ముగ్గురు పిల్లలు. సంక్రాంతి సందర్భంగా నాలుగు అంతస్తుల బిల్డింగ్‌పైన పిల్లలు పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ టైంలో బిల్డింగ్‌పైకి వెళ్లిన మాధవరావు ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.