లెటర్​ టు ఎడిటర్​.. టీచర్​ పోస్టులు తగ్గించవద్దు

రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత సంవత్సరం అసెంబ్లీలో ప్రకటించింది. వాటిలో13,500 ఖాళీలు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నాయని చూపింది. వాటిలో 9400 పోస్టులు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, పండిట్ పోస్టులు ఉన్నాయని ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్ పంపారు. కానీ వాస్తవంగా ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని బడుల్లో కలిపి దాదాపు 20 వేల వరకు టీచర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలతోపాటు పలు అనధికార సర్వేల లెక్కలను బట్టి తెలుస్తున్నది. ప్రభుత్వం ఆ ఖాళీ స్థానాల్లో అటు విద్యావలంటీర్లను నియమించక, ఇటు టీచర్లను భర్తీ చేయకపోవడంతో చాలా స్కూళ్లలో విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. ఈ క్రమంలో కొన్ని స్కూళ్లలో విద్యార్థుల, టీచర్ల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వచ్చింది. 

టీచర్​ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం.. రెండేండ్ల క్రితం ఇచ్చిన జీవో 25 ప్రకారం టీచర్ల రేషనలైజేషన్ చేస్తామంటోంది. అలా చేస్తే పోస్టులు భారీగా తగ్గుతాయి. తద్వారా కొన్ని స్కూళ్లు శాశ్వతంగా మూతపడటం, విద్యార్థులకు నష్టం జరగడంతోపాటు టెట్​ అర్హత సాధించిన దాదాపు 4 లక్షల మంది ఆశావహ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై మరోసారి ఆలోచించాలి. 

- రావుల రామ్మోహన్ రెడ్డి,
బీఎడ్, డీఎడ్​ అభ్యర్థుల సంఘం