6, 7, 8 తరగతులకు ఇయ్యాల్టి నుంచి స్కూల్స్​​ షురూ

6, 7, 8 తరగతులకు ఇయ్యాల్టి నుంచి స్కూల్స్​​ షురూ
  • ఇప్పటికే ప్రారంభమైన 9, 10, ఆపైన క్లా సులు
  • బడిబాట పట్టనున్న మరో 17.10 లక్షల మంది స్టూడెంట్లు
  • ఎడ్యుకేషన్ అధికారులతో మంత్రి సబిత సమీక్ష
  • పేరెంట్స్‌కు ఇష్టముంటెనే పంపించొచ్చని వెల్లడి
  • స్కూలుకు రావాలంటూ ఒత్తిడి చేయొద్దని ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి హైస్కూళ్లు పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన స్టూడెంట్లను బడి బాట పట్టించేందుకు సర్కార్​ నిర్ణయం తీసుకుంది. 6, 7, 8 తరగతులకూ ఫిజికల్​ క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని స్కూళ్లలో ఆయా తరగతులకు క్లాసులు ప్రారంభించడం కోసం మార్చి 1 వరకు అవకాశం ఇచ్చింది. హైస్కూల్​ క్లాసుల ప్రారంభంపై మంగళవారం స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ చిత్రా రామచంద్రన్​, స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ శ్రీదేవసేనతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నిర్ణయంతో మరో 17.10 లక్షల మంది స్టూడెంట్లు బడిబాట పట్టనున్నారు. అయితే, సర్కారు ఇంత సడన్​గా నిర్ణయం తీసుకోవడంపై పేరెంట్స్​లో అయోమయం నెలకొంది.

సేఫ్టీ చర్యలు తీసుకోవాలె: సీఎస్​

క్లాసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టీచర్లు, స్టూడెంట్ల సేఫ్టీ కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, సంక్షేమ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్​ నిర్వహించారు. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి ఎడ్యుకేషన్​ మానిటరింగ్​ కమిటీలు సమావేశం కావాలని, క్లాసులు సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని
సూచించారు.

విద్యావలంటీర్లను నియమించాలి: టీచర్లు

సర్కారు నిర్ణయాన్ని టీచర్ల సంఘాలు స్వాగతించాయి. ఖాళీగా ఉన్న టీచర్​ పోస్టుల స్థానంలో విద్యావలంటీర్లను నియమించాలని టీఎస్​యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీఎస్​జీహెచ్​ఎంఏ, ఎస్టీటీయూ, బీహెచ్​ఎస్​ఎస్​, ఆర్​యూపీపీటీ, ఎస్జీటీ ఫోరమ్​ తదితర సంఘాల నేతలు కోరారు. బడుల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి కరోనా ఎఫెక్ట్​తో 2020–21 విద్యా సంవత్సరం చాలా లేట్​గా మొదలైంది. సెప్టెంబర్​ ఫస్ట్​ నుంచే మూడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఆన్​లైన్​ క్లాసులకు సర్కారు అనుమతిచ్చింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నెల ఫస్ట్​ నుంచి 9, 10 క్లాసులతో పాటు ఆపై తరగతులకూ ఫిజికల్​ క్లాసులు మొదలయ్యాయి. ప్రస్తుతం 8,891 సర్కారీ బడుల్లో 8 లక్షల 88 వేల 742 మంది, 10,275 ప్రైవేట్​ స్కూళ్లలో 8 లక్షల 28 వేల 516 మంది, వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న1,157 గురుకులాల్లో లక్షా 98 వేల 853 మంది స్టూడెంట్స్​ 6, 7, 8 క్లాసులు చదువుతున్నారు.

పేరెంట్స్​కు ఇష్టమైతేనే: మంత్రి సబితారెడ్డి

తల్లిదండ్రుల నుంచి వస్తున్న రిక్వెస్ట్​ల మేరకే బుధవారం నుంచి 6, 7, 8 స్టూడెంట్లకు ఫిజికల్​ క్లాసులను ప్రారంభించేందుకు నిర్ణయించామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. పేరెంట్స్​కు ఇష్టమైతేనే స్టూడెంట్స్​ను క్లాసులకు అనుమతిస్తామన్నారు. స్కూలుకు రావాలంటూ స్టూడెంట్లను ఒత్తిడి చేయొద్దని మేనేజ్​మెంట్లను ఆదేశించారు. ప్రస్తుతం టెన్త్​లో 85 శాతం, ఇంటర్​లో 72 శాతం మంది స్టూడెంట్లు ఫిజికల్​ క్లాసులకు హాజరవుతున్నారని చెప్పారు. స్థానిక ఏర్పాట్లను బట్టి మార్చి 1 వరకు స్కూళ్లను ప్రారంభించుకోవచ్చన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్​ స్కూళ్లలో ప్రత్యేకంగా శానిటైజేషన్​ ప్రక్రియను చేపట్టనున్నట్టు ఆమె చెప్పారు. స్టూడెంట్స్​ తప్పనిసరిగా మాస్క్​ ధరించాలని, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించాలని సూచించారు. క్లాసులకు హాజరు కాని స్టూడెంట్ల కోసం ఆన్​లైన్​ క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. రూములు తక్కువగా ఉంటే షిఫ్ట్​ పద్ధతిలో బడులు నడుపుకోవచ్చని చెప్పారు. కాగా, సర్కారు బడుల్లోని స్టూడెంట్స్​కు మధ్యాహ్న భోజనం పెట్టాల్సిందిగా హెడ్​మాస్టర్లను స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ శ్రీదేవసేన ఆదేశించారు.

ఇవి కూడా చదవండి 

ఈశ్వరీబాయి జీవిత ప్రస్థానం యువతకు స్ఫూర్తి

కార్డియాక్ అరెస్టా.. ? ఇట్ల బయటపడొచ్చు

అమెజాన్ లక్కీ లాటరీ పేరుతో టీచర్ ను ట్రాప్ చేసి.. 

కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది