
మల్లేశ్ గౌడ్ నల్గొండ జిల్లా మోత్కూరు మండలంలోని అజీంపేట్. వాళ్ల అమ్మ లక్ష్మి చాలా కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతోంది. తండ్రి గీత కార్మికుడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మల్లేశ్ పదో తరగతిలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. బతుకుదెరువు కోసం ఊళ్లోనే హౌస్ వైరింగ్ పనులు చేయడం మొదలుపెట్టాడు. భూదాన్ చంపల్లిలోని స్వామి రామానందతీర్థ ఇనిస్టిట్యూట్ లో ఆర్నెల్లు సోలార్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్ ల దగ్గర పని చేశాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. అప్పటినుంచి ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు.
అమ్మ కోసం
మల్లేశ్ తల్లి లక్ష్మి అనారోగ్యంతో ఇంట్లోనే ఉండేది. అయితే ఆమెకు అంటువ్యాధి ఉందేమో అనే అపోహతో ఇతరులు ఎవరూ వాళ్ల ఇంటికి వచ్చేవాళ్లు కాదు. దాంతో ఇంట్లో ఎవరూ లేనప్పుడు లైట్, ఫ్యాన్ వేసుకోవడానికి ఇబ్బంది పడేది. ఒక్కోసారి కుటుంబీకులు పనులపై బయటకెళ్లి ఇంటికొచ్చే సరికి రాత్రయ్యేది. దాంతో ఒక్కోసారి లక్ష్మి చీకట్లోనే ఉండేది. తల్లి పడే ఇబ్బందిని చూసిన మల్లేశ్ చలించిపోయాడు. లక్ష్మి కూర్చున్న చోట నుంచే ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు ఆపరేట్ చేసేందుకు వీలుగా 1998లో సెన్సార్ రిమోట్ ను తయారుచేశాడు. అందుకోసం ఆయన చాలా రోజుల పాటు ‘రిమోట్ ’ పరిశోధనలు చేశాడు. అన్ని రకాల రిమోట్ల గురించి తెలుసుకున్నాడు. ఈ రిమోట్ తయారు చేసేందుకు ఆయనకు ఆర్నెల్లు పట్టింది.
ఆవిష్కరణలు
మల్లేశ్ కు స్నేహితుల్లో ఒకతను దివ్యాంగుడు. అతడు ఎక్కడికైనా వెళ్లాలంటే చేతులతో ట్రైసైకిల్ హ్యాండిల్ తిప్పుతూ చాలా కష్టపడేవాడు. మల్లేశ్ తన స్నేహితుడి కోసం ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచన నుంచే పుట్టిందే ‘సోలార్ ట్రైసైకిల్ ’. ఇది సౌర విద్యుత్ తో నడుస్తుంది. పండ్ల తోటలు సాగుచేసే రైతులకు ఉపయోగపడే విధంగా ఒక పరికరాన్ని తయారు చేశాడు. అది భూమిలో తడి ఆరిపోగానే ‘నీళ్లు లేవు. మోటార్ ఆన్ చేయండి’ అంటూ రైతు సెల్ ఫోన్ కు మెసేజ్ పంపుతుంది. సాగునీటి సమస్యతో బాధపడే రైతులు చాలామంది దీన్ని వాడుతున్నారు. బోరుబావిలో నీళ్లు అయిపోగానే ఆటోమెటిక్ గా మోటారు ఆగిపోయేలా చేసే మరో పరికరాన్ని కూడా రూపొందించాడు. ఇది బోరుబావిలో నీళ్లు ఊరగానే మళ్లీ మోటారును స్టార్ట్ చేస్తుంది. చాలామంది మందుతాగి వాహనాలు నడుపుతుంటారు. అలాంటప్పుడు కొందరు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే తాగి వెహికిల్ నడిపితే పసిగట్టి ఇంజిన్ ఆఫ్ చేసే పరికరాన్ని తయారుచేశాడు . రైతుల కోసం సౌరశక్తితో పని చేసే స్ప్రేయర్ రూపొందించాడు. దీని వల్ల రైతులకు శ్రమ తగ్గుతుంది. అందుకే వీటిని సబ్సిడీతో రైతులకు అందించాలని ప్రభుత్వానికి లేఖ కూడా రాశాడు మల్లేశ్.