
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ కు సప్లై చేస్తున్న ప్రొటోకాల్ ఫుడ్ లో క్వాలిటీ ఉండడం లేదు. సీఎం సహా మంత్రులు, ఐఏఎస్లు, ఇతర అధికారులకు సప్లై అయ్యే భోజనం, స్నాక్స్ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. ఇటీవల ఈ ఫుడ్ తిని సెక్రటేరియెట్ లో పలువురికి ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలు జరిగినప్పుడు కంప్లయింట్ చేస్తే.. ఒకట్రెండు రోజులు మెను మార్చి ఫుడ్ తెచ్చిన కాంట్రాక్టర్, మళ్లీ పాత పద్ధతిలోనే ఫుడ్సప్లై చేస్తూ వస్తున్నాడు. దీంతో ఆ ఫుడ్తిని అనారోగ్యానికి గురికావడం కంటే తినకపోవడమే మంచిదని సెక్రటేరియెట్ సిబ్బంది అంటున్నారు. అధికారులు సహా సిబ్బంది ఇంటి నుంచే లంచ్ బాక్స్ లు తెచ్చుకుంటున్నారు. ప్రొటోకాల్ఫుడ్అంటే చాలు.. తమకు వద్దని తిరస్కరిస్తున్నారు.
నెలకు రూ.కోట్లలో బిల్లు..
సెక్రటేరియెట్లో ప్రొటోకాల్ కింద సప్లై చేసే ఫుడ్ కోసం కాంట్రాక్టర్కు ప్రతినెలా రూ.కోట్లలో బిల్లులు చెల్లిస్తున్నట్టు తెలిసింది. కానీ ఆ ఫుడ్ ఎక్కడ తయారవుతున్నది? ఎలా తయారు చేస్తున్నారు? అనే కనీస తనిఖీలు కూడా చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఎన్ని ప్లేట్లు సప్లై చేస్తున్నారు? వాటికి ఎంత ఖర్చవుతుందనే లెక్కలను కూడా ప్రొటోకాల్సిబ్బంది బయటకు వెల్లడించడం లేదు. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందని మీడియా అడిగినా.. తెలియదు అనే సమాధానమే వస్తోంది.
ఈ వ్యవహారంపై ప్రొటోకాల్ ఉన్నతాధికారులు చూసిచూడనట్టు ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రొటోకాల్ ఫుడ్ కాంట్రాక్టర్.. ఆ ఫుడ్ ను సొంతంగా తయారు చేసి పంపడం లేదని తెలుస్తున్నది. నగర శివారులో బల్క్ గా వంటలు చేసేవాళ్ల దగ్గరి తీసుకుని సెక్రటేరియెట్కు పంపుతున్నట్టు సమాచారం. ఫుడ్ క్వాలిటీ బాలేదని సెక్రటేరియెట్ సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా ఆ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. దీంతో అతని వెనుక ఎవరున్నారనే చర్చ జరుగుతున్నది. దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని సెక్రటేరియెట్ సిబ్బంది కోరుతున్నారు.