తెలంగాణకు మరో 4 పెద్ద సంస్థలు.. కొత్త పరిశ్రమలతో 5 వేల మందికి ఉపాధి..

హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో 4 పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో రూ.7,592 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. ఏరోస్పేస్​ అండ్ ​డిఫెన్స్​ రంగంలో ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఘనపూర్​లో 25 ఎకరాల విస్తీర్ణంలో సూపర్​అల్లాయ్​ మాన్యుఫ్యాక్చరింగ్​ ప్లాంట్​ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 600 మందికి ఉపాధి కల్పించనుంది. ఎలక్ట్రానిక్స్​అండ్​ఎనర్జీ స్టోరేజీకి సంబంధించి ప్రీమియర్​ ఎనర్జీస్ ​సంస్థ రూ.1,700 కోట్లతో సోలార్ ఇంగాట్స్, అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. సీతారాంపూర్​లో 125 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్​ద్వారా 1,500 మందికి ఉపాధి కల్పించనుంది.

ఇదే సెక్టార్లో ప్రీమియర్ ఎనర్జీస్​ గ్లోబల్​ ఎన్విరాన్మెంట్​ ప్రైవేట్​ లిమిటెడ్ ​సంస్థ.. సీతారాంపూర్​లోనే 4 గిగావాట్ల పీవీటాప్ ​కాన్​సెల్, 4 గిగావాట్ల పీవీటాప్​కాన్​ మాడ్యూల్స్​ మాన్యుఫ్యాక్చరింగ్​ యూనిట్ ​ఏర్పాటు చేయనుంది. 75 ఎకరాల్లో రూ.3,342 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ద్వారా వెయ్యి మందికి ఉపాధి కల్పించనుంది. ఫ్యాబ్​సిటీలో లెన్స్​కార్ట్​సంస్థ.. కళ్లద్దాలను తయారు చేసే మాన్యుఫ్యాక్చరింగ్​ యూనిట్​ను ఏర్పాటు చేయనుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ ద్వారా 2,100 మందికి ఉపాధి దొరకనుంది. మొత్తంగా రూ.7,592 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరగ్గా, 5,200 మందికి ఉపాధి లభించనుంది.