
- వరద సాయం కింద రాష్ట్రానికి కేంద్రం అరకొర నిధులు
- పక్కనే ఉన్న ఏపీకి మాత్రం రూ.608 కోట్లు రిలీజ్
- అక్కడ మనకంటే తక్కువ నష్టం జరిగినా ఎక్కువ ఫండ్స్
- పోయినేడు భారీ వర్షాలకు రాష్ట్రంలో తీవ్ర నష్టం
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు : వరద సాయంలోనూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది. పోయినేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వేల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో సాయం చేయాలని రాష్ట్ర సర్కార్ విజ్ఞప్తి చేయగా, అరకొర నిధులతో కేంద్రం సరిపెట్టింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) ద్వారా రూ.10 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదనలు పంపిస్తే, కంటితుడుపు సాయంగా రూ.231 కోట్లు రిలీజ్ చేసింది. ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఏపీలో తెలంగాణ కంటే తక్కువ నష్టం వాటిల్లినప్పటికీ, ఆ రాష్ట్రానికి మాత్రం రూ.608.08 కోట్లు విడుదల చేసింది.
తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపిస్తుందంటూ వస్తున్న ఆరోపణలకు ఈ వరద సాయం నిధుల విడుదల ఉదాహరణగా నిలుస్తున్నది. కాగా, రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వారిలో ఇద్దరు కేంద్రమంత్రులుగా పని చేస్తున్నారు. మరో రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నారు. రాష్ట్ర బీజేపీ నుంచి కేంద్రంలో ఇంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నా.. రాష్ట్రానికి కనీసం వరద సాయం నిధులు తీసుకరాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
నిబంధనలు మార్చాలన్నా పట్టించుకోవట్లే..
విపత్తు నిర్వహణ నిబంధనలతో పాటు ఖర్చు మార్గదర్శకాల్లోనూ మార్పుచేర్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. గతేడాది రాష్ట్రానికి వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి కూడా ఇదే విషయమై విజ్ఞప్తి చేసింది. ఉదాహరణకు పంట నష్టానికి వస్తే కచ్చితంగా 33 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం ఇవ్వాలని.. వర్షాధార పంటలకైతే ఎకరాకు రూ.3,400, వరిలాంటి పంటలకైతే ఎకరాకు రూ.6,800 ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా వంద శాతం పంట దెబ్బతింటేనే ఇస్తున్నారు. 33 శాతం, ఆపైన దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.2 వేలే ఇస్తున్నారు.
అదే ఇసుక మేటలు వేస్తే ఈ మొత్తాన్ని ఇంకా తగ్గిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నిబంధనల జోలికి వెళ్లకుండా పంట దెబ్బతిని నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.10 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇచ్చింది. ఇక కూలిపోయిన ఇండ్లకు పరిహారం కింద రూ.1.20 లక్షలు, 15 శాతం వరకు దెబ్బతిన్న ఇండ్లకు కేవలం రూ.6,500 చొప్పున కేంద్రం ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇండ్లు కోల్పోయిన వాళ్లందరికీ ఇందిరమ్మ ఇండ్ల కింద రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. రోడ్ల విషయానికొస్తే.. ఒక కిలో మీటరు రోడ్డు పూర్తిగా డ్యామేజీ అయితే రూ.లక్ష, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రూ.60 వేల చొప్పున కేంద్రం ఇస్తున్నది. ఈ మొత్తం ఎటూచాలడం లేదని రాష్ట్ర అధికారులు చెప్తున్నారు.
వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం..
రాష్ట్రంలో పోయినేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంటలు, రోడ్లు, ఇండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన రెండు కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలించాయి. వివిధ శాఖల నుంచి క్షేత్రస్థాయి వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం రూ.10,320 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసి.. కేంద్ర బృందాల ముందు పెట్టింది. ఇందులో రోడ్లకు జరిగిన నష్టమే అత్యధికంగా రూ.7,693 కోట్ల మేర ఉంది.
రూ.231 కోట్ల మేర పంట నష్టం జరిగినట్టు తేల్చింది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర బృందాలతో సమావేశమై.. ఏపీకి ఎంత సాయం అందిస్తారో, అదే తీరుగా తెలంగాణకూ సాయం అందించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరుగా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గతంలో రెగ్యులర్ ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లోనూ రాష్ట్రానికి రూ.416 కోట్లు, ఏపీకి రూ.1,036 కోట్లు కేంద్రం కేటాయింపులు చేసింది.
హైలెవెల్ కమిటీ మీటింగ్ లో నిర్ణయం..
ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఐదు రాష్ట్రాలకు రూ.1,554.99 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన హైలెవెల్ కమిటీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు కేటాయించారు.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) కింద ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన రెగ్యులర్ నిధులకు అదనంగా ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2024–25లో కేంద్ర ప్రభుత్వం 27 రాష్ట్రాలకు రూ.18,322.80 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను విడుదల చేసింది. విపత్తులు, వరదలు సంభవించినప్పుడు తీవ్రతను బట్టి అదనపు ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తున్నది.